చేసిన పనికి బిల్లులు రాక పాఠశాల గేట్ కు తాళం వేసిన మాజీ సర్పంచ్

సాక్షి డిజిటల్ న్యూస్ 20 జనవరి వలిగొండ రిపోర్టర్ కుమారస్వామి: మండలంలోని సంగెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు మూడు సంవత్సరాల క్రితం చేయించిన పనులకు బిల్లులు రాలేదని మాజీ సర్పంచ్ రామ్ రెడ్డి పాఠశాల గేట్ కు తాళం వేశారు. పాఠశాలకు వచ్చిన విద్యార్థిని, విద్యార్థులు గేటుకు తాళం వేసి ఉండడంతో గేటు బయట నిరీక్షించాల్సి వచ్చింది. గత ప్రభుత్వం హయాంలో మన ఊరు మన బడి కార్యక్రమంలో రూ.28 లక్షలతో పని మంజూరు కాగా పనులు పూర్తి చేసినప్పటికీ కేవలం రూ.5 లక్షలు మాత్రమే వచ్చాయని ఇంకా 23 లక్షల రూపాయలు రావాల్సి ఉందని ఆయన తెలిపారు. ప్రాథమిక పాఠశాలలో కూడా రూ.5లక్షల పని చేయించినట్టు తెలిపారు. అందులో ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదని అన్నారు. నేటికి కూడా బిల్లులు రాకపోవడంతో చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక పాఠశాల గేటుకు తాళం వేసినట్టు మాజీ సర్పంచ్ కీసరి రామ్ రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారికి తెలియజేయగా ఆయన మాజీ సర్పంచ్ రామ్ రెడ్డితో మాట్లాడి బిల్లులు వస్తాయని తెలియజేయడంతో రామ్ రెడ్డి పాఠశాల గేటు తాళం తెరిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *