సాక్షి డిజిటల్ న్యూస్: జనవరి- 20-2026, సత్తెనపల్లి మండల్ రిపోర్టర్: సిహెచ్ విజయ్: గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు ముఖ్యమైన సమస్యలను ఎమ్మెల్యే గళ్ళా మాధవి కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా పీకల వాగు ప్రక్షాళన అంశం, వీధి కుక్కల సమస్య వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు, అలాగే ఖాళీ స్థలాల కారణంగా ఏర్పడుతున్న పారిశుద్ధ్య, భద్రతా సమస్యలను వివరించారు. అదేవిధంగా తాగునీటి సరఫరా సంబంధిత ప్రజా సమస్యలను కూడా వివరించారు. రాబోయే వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకొని, నగరంలో ఎక్కడా తాగునీటి కొరత తలెత్తకుండా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని, ప్రధాన కాలువలు మరియు డ్రెయిన్లలో పూడిక తొలగింపు పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు. ప్రజా సమస్యలపై కమిషనర్ మయూర్ అశోక్ సానుకూలంగా స్పందిస్తూ, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరగతిన పరిష్కరించేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్, కొమ్మినేని కోటేశ్వరరావు, ఈరంటి వర ప్రసాద్, తేలుకట్ల హనుమాయమ్మ, అడకా పద్మావతి, మానం పద్మ శ్రీ, శ్రీవల్లి, సాధు రాజేష్, నిమ్మల రమణ తదితరులు పాల్గొన్నారు.