సాక్షి డిజిటల్ న్యూస్: జూలూరుపాడు/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనవరి 20 రిపోర్టర్ షేక్ సమీర్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు బొందపెట్టడం ఖాయమని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు హెచ్చరించారు. బీఆర్ఎస్ అంటే తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవమని, అలాంటి పార్టీ గద్దెలు కూల్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గద్దెలను ప్రజలు కూల్చే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. తెలంగాణలో ఉన్న కొద్దిమంది ఓట్ల కోసం టీడీపీ గురించి సీఎం రేవంత్ రెడ్డి మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. టీడీపీ ఇండియా కూటమిలో ఉన్నదా? ఎన్డీఏ కూటమిలో ఉన్నదా? అని ప్రశ్నించారు. అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీనా? టీడీపీనా? తేల్చుకోవాలని సూచించారు. ఓట్ల కోసం నాటకాలు ఆడితే అన్నిసార్లు ప్రజలు నమ్ముతారనుకోవడం అవివేకమని చురకలంటించారు. సీఎం హోదాలో ఉండి చిల్లరకూతలుకూయడం రేవంత్ మానసికస్థితికి అద్దం పడుతుందని ఎద్దేవాచేశారు. సహచర మంత్రులతో ఉన్న విభేదాలతో ఏం చేయాలో తెలియక, వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఈ వ్యాఖ్యలు చేసినట్టు పేర్కొన్నారు.