సాక్షి డిజిటల్ న్యూస్ 20 జనవరి 2026 తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్చార్జి రమేష్ బాబు రాము: అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె మండల కేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు టిడిపి నాయకులు శ్రీకారం చుట్టారు. ఇందుకు సంబంధించి విగ్రహం ఏర్పాటుకు దిమ్మె సైతం నిర్మించారు. ఆదివారం ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు అనుమతులు లేవని పోలీసులు టిడిపి నాయకులకు సమాచారం అందించారు. ఈ విషయమై మండలంలోని టిడిపి నాయకులు పోలీస్ స్టేషన్ కు తరలి వెళ్లి విగ్రహం ఏర్పాటుకు సహకరించాలని ఎస్సై అనిల్ కుమార్ ను కోరారు. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు గ్రామపంచాయతీ, రెవిన్యూ, ఆర్ అండ్ బి అధికారుల అనుమతి పత్రాలు ఉండాలని ఎస్సై అనిల్ కుమార్ నాయకులకు సూచించారు. టిడిపి నాయకులు తమకు విగ్రహం ఏర్పాటుకు అధికారులు అనుమతులు ఇచ్చారని తమ వాదనలు వినిపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మండల కేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసుకోవాలని సంతోషంగా నిర్మాణ పనులు ముమ్మరం చేయగా నిర్మాణానికి అడ్డంకులు ఏర్పడడంతో టిడిపి నాయకులు సందిగ్ధంలో పడ్డారు. తంబళ్లపల్లె నియోజకవర్గం ఇప్పటికే నాయకత్వ లోపంతో తమ పనులు జరగలేదని పలుమార్లు పార్టీ పెద్దలకు చెప్పుకోవడం పరిపాటిగా మారింది. అయితే అధికారంలో ఉండి కూడా సాక్షాత్తు టిడిపి వ్యవస్థాపకుని విగ్రహం ఏర్పాటు చేయడానికి ఇన్ని అడ్డంకులా అని టిడిపి నాయకులు, కార్యకర్తలు వాపోతున్నారు.