ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 20 మంచిర్యాల జిల్లా ప్రతినిధి లింగంపల్లి మహేష్: మందమర్రి పట్టణంలోని మార్కెట్ ఏరియా మొదటి జోన్‌కు చెందిన సబ్బని విజయలక్ష్మి (53) సోమవారం ఉదయం తన నివాసంలోని బాత్‌రూమ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతి చెందిన విజయలక్ష్మి గత పది ఏళ్లుగా పట్టణంలోని తవక్కల్ పాఠశాలలో బయాలజీ ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. ఆమె భర్త సబ్బని శేఖర్ మాజీ సింగరేణి ఉద్యోగి. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఏడు నెలల క్రితం విజయలక్ష్మికి హైదరాబాద్‌లో పక్షవాతానికి సంబంధించిన బ్రెయిన్ ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ అనంతరం తలెత్తిన ఆరోగ్య సమస్యల కారణంగా ఆమె మానసిక వేదనకు గురయ్యారు. అనారోగ్యం రీత్యా ఆమె తన ఉపాధ్యాయ వృత్తికి కూడా స్వస్తి పలికారు. ఈ క్రమంలో మనస్తాపం చెందిన ఆమె, సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో బాత్‌రూమ్‌లోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. భర్త సబ్బని శేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మందమర్రి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఎస్సై రాజశేఖర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉందని ఎస్సై తెలిపారు.