సాక్షి డిజిటల్ న్యూస్: 19 జనవరి 2026, (సత్తెనపల్లి మండల రిపోర్టర్: సిహెచ్ విజయ్) దేశంలో మహిళా ఆర్థిక సాధికారత కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో గుంటూరులో చేపట్టిన సరస్ మేళా సూపర్ సక్సెస్ అయ్యిందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనారిటీస్ కమిటీ చైర్మన్ నసీర్ అన్నారు. గుంటూరులోని నరసరావుపేట రోడ్డులో ఏర్పాటు చేసిన సరస్ మేళాను ఎమ్మెల్యే నసీర్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రతి స్టాల్ వద్దకు వెళ్లి ఆయా ఉత్పత్తుల తయారీ, విక్రయాల గురించి డ్వాక్రా సంఘాల సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన గ్రూపు సభ్యులతో మాట్లాడారు. అక్కడ సంఘాల నిర్వహణ వంటి వాటి వివరాల గురించి ఆరా తీశారు. గుంటూరు నగరంలో ప్రజల నుంచి స్పందన ఎలా ఉందని అడిగారు. దీనిపై ఆయా డ్వాక్రా సంఘాల సభ్యులు సానుకూలంగా స్పందించారు. ఫుడ్ కోర్టును పరిశీలించిన ఎమ్మెల్యే నసీర్ అక్కడ వంటకాల రుచి చూసి .. చాలా బాగున్నాయంటూ కితాబిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ ఢిల్లీ వంటి మహానగరంలో ఏర్పాటు చేసే ఇలాంటి మేళాలను గుంటూరు నగరానికి తీసుకురావడం శుభపరిణామ మన్నారు. దేశ వ్యాప్తంగా 21 రాష్ట్రాల నుంచి 600 SHG గ్రూపుల ద్వారా సుమారు 320 స్టాల్స్ ఏర్పాటు చేసేందుకు డ్వాక్రా సంఘాల మహిళలు తరలి రావడం సంతోషకరమన్నారు. సరస్ మేళా గ్రామీణ మహిళలు, స్వయం సహాయ సంఘాల జీవితాల్లో ఎన్నో సానుకూల మార్పులు తీసుకొచ్చిందని తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేసేందుకు దోహదపడుతుందన్నారు. కూటమి ప్రభుత్వ సహకారంతో మహిళలు వ్యాపార రంగాల్లో విజయవంతం కాగలమనే ఆత్మవిశ్వాసం పొందారని చెప్పారు. ఉద్యోగాలపై ఆధారపడకుండా స్వయం ఉపాధితో జీవించగల స్థితికి మహిళలు చేరుకున్నారని వెల్లడించారు. జాతీయ స్థాయి సరస్ మేళా గ్రామీణ మహిళల శక్తి, స్వయం ఉపాధి సామర్థ్యం, నాయకత్వ ప్రతిభకు ప్రత్యక్ష నిదర్శనమని చెప్పారు. ఇలాంటి కార్యక్రమానికి రూపకల్పన చేసిన సీఎం నారా చంద్రబాబు నాయుడుకు, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళల విజయాలే ఇక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ అని చెప్పారు. ఇంటికో పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దేందుకు ఇలాంటి మేళాలు దోహదం చేస్తాయన్నారు.