జమ్మికుంట 22వ వార్డు కౌన్సిలర్ బరిలో విద్యావంతురాలు గుల్లి అభిలాష

సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి 19 జమ్మికుంట టౌన్ రిపోర్టర్, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో జమ్మికుంట పట్టణంలోని 22వ వార్డు నుంచి కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో నిలవనున్నట్లు విద్యావంతురాలు గుల్లి అభిలాష ప్రకటించారు. కార్మికుడి కుటుంబంలో జన్మించి, నిరుపేద దళిత కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన తనకు వార్డు ప్రజల సమస్యలపై పూర్తి అవగాహన ఉందని ఆమె పేర్కొన్నారు. తాను పుట్టి పెరిగిన అంబేద్కర్ కాలనీతో పాటు 22వ వార్డును జమ్మికుంట పట్టణంలోనే ఆదర్శవంతమైన వార్డుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నట్లు తెలిపారు. ఒక ఆడబిడ్డగా, విద్యావంతురాలిగా, ప్రజా సమస్యలపై అవగాహన కలిగిన బిడ్డగా తనను ఆశీర్వదించాలని వార్డు ప్రజలను ఆమె కోరారు.వర్షాకాలంలో ఎదురయ్యే సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని, గత కొన్ని సంవత్సరాలుగా నిర్మాణం జరగకుండా నిలిచిపోయిన అంబేద్కర్ భవనాన్ని పూర్తి చేస్తానని, సిటీ కేబుల్ లైన్ వద్ద, నాయిని చెరువుకు వెళ్లే కూడలిలో సెంట్రల్ లైటింగ్‌తో కూడిన సర్కిళ్లు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.అలాగే వార్డులోని డ్రైనేజ్, పారిశుధ్య సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తానని తెలిపారు. కుల, మతాలకు అతీతంగా ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి వస్తున్నానని, గెలిస్తే నాయకురాలిగా కాకుండా ఒక సేవకురాలిగా, ప్రతి అవ్వకు ఒక బిడ్డగా, అన్నలకు చెల్లెలిగా, తమ్ముళ్లకు అక్కగా అందుబాటులో ఉంటూ పని చేస్తానని గుల్లి అభిలాష ధీమా వ్యక్తం చేశారు. రిజర్వేషన్ అనుకూలిస్తే తప్పకుండా బరిలో ఉంటానని, పైసలకు, ప్రలోభాలకు లొంగకుండా ప్రజల కోసం నిరంతరం సేవ చేస్తానని తెలిపారు. తనను ఆశీర్వదించి గెలిపించి, వార్డు ప్రజల సేవ చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *