ఖమ్మంలో సిపిఐ శతాబ్ది ఉత్సవాలకు తరలిరండి

★చిత్తూరు నుంచి భారీగా పాల్గొనాలి : సిపిఐ జిల్లా కార్యదర్శి వైఎస్‌. నాగరాజు పిలుపు

సాక్షి డిజిటల్ న్యూస్ చిత్తూరు పట్టణం (రిపోర్టర్ జయచంద్ర): భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆవిర్భవించి 2025 డిసెంబర్‌ 26 నాటికి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా జనవరి 18న ఖమ్మం జిల్లాలో నిర్వహించనున్న శతాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి వైఎస్‌. నాగరాజు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సోమవారం చిత్తూరు నగరంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నుంచి సిపిఐ నాయకులు, కార్యకర్తలు ఎర్రజెండాలు చేతబట్టి డప్పులు మోగిస్తూ, విప్లవ గీతాలు ఆలపిస్తూ భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శన హైరోడ్‌, బజారు వీధి, డీఐ రోడ్డుల మీదుగా సాగి అక్కడితో ముగిసింది. ప్రదర్శన అనంతరం వైఎస్‌. నాగరాజు మాట్లాడుతూ… సిపిఐ ఆవిర్భవించిన నాటి నుంచి భూమి కోసం, భుక్తి కోసం, సమసమాజ స్థాపన కోసం నిరంతరం పోరాడుతున్న పార్టీ అని అన్నారు. దళితులు, గిరిజనులు, ఆదివాసులు, మైనార్టీలు, కార్మికులు, రైతులు వంటి బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాటమే సిపిఐ విధానమని స్పష్టం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల పక్షాన నిలిచిన పార్టీ ఎర్రజెండా పార్టీ అని కొనియాడారు.
జనవరి 18న ఖమ్మం జిల్లాలో లక్షలాది మంది కార్యకర్తలతో జరగనున్న శతాబ్ది ఉత్సవాలకు చిత్తూరు జిల్లా నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాసంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్యమండలి జిల్లా అధ్యక్షులు ఎస్‌. గుర్రప్ప, జిల్లా కార్యదర్శి కలవకుంట హరినాథ్ డప్పులు మోగిస్తూ విప్లవ గీతాలు పాడి ప్రజలను ఆకట్టుకున్నారు. ప్రదర్శనలో సిపిఐ నగర కార్యదర్శి వీసీ గోపీనాథ్‌, పార్టీ సీనియర్‌ నాయకులు కె. మణి, జిల్లా కార్యవర్గ సభ్యులు కె. విజయగౌరీ, కె. రమాదేవి, జిల్లా కౌన్సిల్‌ సభ్యులు ఏ. సత్యమూర్తి, ఎం. విజయ్‌కుమార్‌, ఏ. జమీలాభి, బి. కుమారి, పి. రఘు, లతారెడ్డి, టీసీ మహేష్‌, ఎన్‌. జలంధర్‌, రామమూర్తి, హెచ్‌. బాలాజీ రావు, పి. గజేంద్రబాబు, వి. కోమల, యస్‌. దేవయాని, ఫైరోజ్‌, రోజా, శ్యామల తదితరులు పాల్గొన్నారు.