కూలీల సమస్యలపై జనతా వారధి ఘాటు ప్రస్తావన

*డికెటి భూములు చూపలేని అధికారులు – ఉపాధి హామీ బిల్లులపై తక్షణ చర్యలకు ట్రైనీ కలెక్టర్ ఆదేశాలు

సాక్షి డిజిటల్ న్యూస్ చిత్తూరుటౌన్(రిపోర్టర్ జయచంద్ర): బీజేపీ జనతా వారధి కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పేద కూలీల సమస్యలను జనతా వారధి నాయకులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. చిత్తూరు జిల్లా విజయపురం మండలం కన్నికాపురం ఆదిఆంధ్రవాడలో కూలిపనులతో జీవనం సాగిస్తున్న 36 మంది కూలీలకు సుమారు 15 సంవత్సరాల క్రితం ప్రభుత్వం డికెటి భూములను పాసుపుస్తకాలతో సహా పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. భూములు పొందిన లబ్ధిదారులు నేటికీ రైతు భరోసా పొందుతున్నప్పటికీ, ఇప్పటివరకు వారికి కేటాయించిన భూములను సంబంధిత అధికారులు చూపించలేకపోతున్నారని కూలీలు వాపోయారు. ఈ సమస్యపై పరిష్కారం కోసం మండల రెవెన్యూ కార్యాలయానికి ఎన్నోసార్లు వెళ్లినా ఫలితం లేకుండా పోయిందని వారు తమ ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా చిత్తూరు రూరల్ మండలం కుర్చివేడు పంచాయతీ వి.యన్.పురంలో ఉపాధి హామీ పథకం కింద పనులు చేసిన కూలీలకు ఆరు వారాలు గడిచినా ఇప్పటివరకు బిల్లులు చెల్లించలేదని మరో ఫిర్యాదు చేశారు. ఈ అంశాన్ని జిల్లా ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పడాల్ దృష్టికి జనతా వారధి నాయకులు తీసుకువెళ్లగా, ఆయన సంబంధిత అధికారులతో వెంటనే మాట్లాడి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జనతా వారధి జిల్లా ఇన్‌చార్జి మరియు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు, జిల్లా ఉపాధ్యక్షులు కె. రవికుమార్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు కైలాసం, సౌత్ మండల అధ్యక్షులు సురేష్ బాబు, నార్త్ మండల అధ్యక్షులు లితిష్ కుమార్, పూతలపట్టు మండల అధ్యక్షులు వై. ప్రసాద్, జిల్లా బీజేవైఎం నాయకులు ఢిల్లీ బాబు, జిల్లా కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ, మండల ఉపాధ్యక్షులు ఈశా గణేష్, మండల కార్యదర్శి సతీష్, నంద తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *