సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి13, జి.మాడుగుల : అడవుల్లో జరిగే అగ్ని ప్రమాదాలు పర్యావరణ సమతు ల్యతను దెబ్బతీస్తూ, వన్యప్రాణులు-మానవ జీవనానికి తీవ్ర ప్రమాదంగా మారుతున్నాయని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ బాబురావు అన్నారు. జి.మాడుగుల మండలం, నుర్మతి పంచాయతీ డిప్పలగొందిలో అటవీ అగ్ని ప్రమాదాల నివారణపై నిర్వహించిన అవగాహన కార్యక్రమాని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అడవుల్లో నిప్పు పెట్టడం వల్ల వేలాది చెట్లు, వన్యప్రాణులు నశించడమే కాకుండా వర్షపాతం, వాతావరణంపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు. పొలాలు శుభ్రం చేసే సమయంలో మంటలు అడవిలోకి వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, బీడీలు, సిగరెట్ మిగతాలు అడవుల్లో వేయరాదని సూచించారు. ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే అటవీ శాఖకు సమాచారం ఇవ్వాలని కోరారు. అడవులను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని, ప్రజల సహకారంతోనే అగ్ని ప్రమాదాలను పూర్తిగా నివారించవచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామస్తుల్లో అవగాహన పెంచడం లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీట్ ఆఫీసర్లు శ్రీనివాస్ ప్రసాద్, దివ్య, గోవింద్ రాజు పాల్గొన్నారు.