సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి/12/1/2026 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రైమ్ రిపోర్టర్, సంక్రాంతి పండుగ సందర్భంగా పతంగులు ఎగురవేసే ఉత్సాహంతో పాటు పక్షుల ప్రాణరక్షణకు కూడా ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని అటవీ, పోలీస్ శాఖలు పిలుపునిచ్చాయి. పినపాక మండలం ఈ బయ్యారం గ్రామంలో ఈ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు, ఫారెస్ట్ రేంజ్ అవగాహన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తేజస్విని మాట్లాడుతూ పతంగులు ఎగురవేసేందుకు కేవలం కాటన్ దారాలనే ఉపయోగిం చాలని సూచించారు. ప్రమాదకరమైన చైనా మాంజా వల్ల పక్షులు తీవ్రంగా గాయపడటమే కాకుండా, మనుషులకూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. అందుకే ‘చైనా మాంజాపై ప్రజలకు అవగాహన కల్పించి పక్షులను రక్షిద్దాం’ అనే నినాదంతో వాల్‌పోస్టర్‌ను విడుదల చేసినట్లు తెలిపారు. సీఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ చైనా మాంజాను అమ్మినా, నిల్వ చేసినా లేదా రవాణా చేసినా చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చైనా మాంజా అక్రమ వ్యాపారంలో పట్టుబడితే ఐదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. చైనా దారం అమ్మకం లేదా నిల్వకు సంబంధించిన సమాచారం ఉంటే 040-23231440 లేదా 1800-425-5364 నంబర్లకు ఫోన్ చేసి తెలియజేయాలని ప్రజలకు సూచించారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఎస్ఐ సురేష్‌తో అటవీ శాఖ, పోలీస్ శాఖ అధికారులు పాల్గొన్నారు. పండుగ ఆనందం బాధ్యతగా కొనసాగితేనే ప్రకృతి, పక్షిజాలాన్ని కాపాడగలమని అధికారులు ప్రజలను కోరారు.