సాక్షి డిజిటల్ న్యూస్, 09/జనవరి/2026, షాద్ నగర్:రిపోర్టర్/కృష్ణ, బీఆర్ఎస్ నాయకుల తీరుపై షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ నిప్పులు చెరిగారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు ఆడుతున్నారని, వారి భాష చూస్తుంటే ప్రజాప్రతినిధుల్లా కాకుండా “90 ఎంఎల్” తాగిన వ్యక్తుల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ వ్యవహారశైలి ప్రస్తుతం కేఏ పాల్‌ను తలపి స్తోందని, ప్రజల్లో ఆయన హాస్యాస్పదంగా మారుతున్నారని ఎద్దేవా చేశారు. ”మీ బతుకేంటో మీ ఇంటి కవితమ్మే చెబుతోంది” అంటూ, గత పదేళ్ల అవినీతి భాగవతాన్ని సొంత కుటుంబ సభ్యులే బయట పెడుతున్నారని విమర్శించారు. అమరవీరుల త్యాగాలతో వచ్చిన తెలంగాణలో, కేసీఆర్ కుటుంబం మాత్రమే పదవులు అనుభవించిందని, శ్రీకాంతాచారి వంటి ఎందరో త్యాగధనుల కుటుంబాలను రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలను వ్యక్తిగతంగా దూషిస్తే సహించేది లేదని, అరాచకాలను సాగనివ్వబోమని హెచ్చరించారు.
”లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టు 90 శాతం పూర్తయిందని చెప్పడం పచ్చి అబద్ధం. అక్కడ మట్టి తవ్విన దాఖలాలు కూడా లేవు. అధికారం పోయినా బుద్ధి రాకుండా అడ్డగోలుగా మాట్లాడితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారు.”
ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ జెడ్పిటిసి వెంకటరామిరెడ్డి, ఎమ్మెస్ సత్తయ్య మాట్లాడుతూ.. అసెంబ్లీలో ఉద్యమకారుల గళాన్ని వినిపించినందుకు ఎమ్మెల్యే శంకర్‌కు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయని నమ్మించి బీఆర్ఎస్ మోసం చేసిందని వారు ఆరోపించారు.
ఈ మీడియా సమావేశంలో నాయకులు మరియు ఇతర ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఉద్యమకారులు ఎమ్మెల్యేకు గులాబీ మొక్కను బహుకరించి తమ సంఘీభావాన్ని ప్రకటించారు….