బీసీలకు చట్టబద్ధమైన “బీసీ సబ్ ప్లాన్” అమలు చేయాలి.

*టిఆర్పి పార్టీ డిమాండ్ తో తహసిల్దార్ కు వినతి పత్రం అందజేత. *వనపర్తి జిల్లా యూత్ అధ్యక్షులు జి.రవికుమార్.

సాక్షి డిజిటల్ న్యూస్ 08 జనవరి వనపర్తి జిల్లా పెబ్బేరు : ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ తరహాలోనే వెనుకబడిన తరగతుల (బీసీ) సమగ్ర అభివృద్ధి కోసం చట్టబద్ధమైన “బీసీ సబ్ ప్లాన్”ను తక్షణమే అమలు చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ వనపర్తి జిల్లా యూత్ అధ్యక్షులు జి.రవికుమార్ కోరారు.ఈ మేరకు వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం కేంద్రంలో టిఆర్పి పార్టీ వ్యవస్థాపకులు అధ్యక్షులు,ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిలుపు,రాష్ట్ర యూత్ అధ్యక్షులు బొడ్డుపల్లి చంద్రశేఖర్ ఆదేశాలు మేరకు తహసీల్దార్ కు గురువారం నాడు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీల సామాజికం,ఆర్థిక,విద్యా అభివృద్ధి కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు,చట్టపరమైన రక్షణ అత్యంత అవసరమని అన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 నుంచి ఇప్పటి వరకు బీసీల కోసం బడ్జెట్‌లో కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేయకుండా మిగులు చూపడం వల్ల బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని విమర్శించారు.కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ బీసీలకు ప్రతి బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని,ఇచ్చిన హామీని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బీసీల జనాభా నిష్పత్తికి అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్‌లో కనీసం 50 శాతం పైగా నిధులు కేటాయించాలన్నారు.అలాగే బీసీల కోసం కేటాయించిన నిధులు పక్కదారి పట్టకుండా ఉండేందుకు “బీసీ సబ్ ప్లాన్”కు చట్టబద్ధత కల్పించాలని కోరారు. విద్యా రంగంలో ప్రతి మండలంలో బహుజన గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేయాలని, విదేశీ విద్యానిధి పథకాన్ని మరింత సరళతరం చేయాలని సూచించారు.నిరుద్యోగ బీసీ యువతకు,సంప్రదాయ కుల వృత్తులపై ఆధారపడిన వారికి ఎలాంటి షరతులు లేకుండా సబ్సిడీతో కూడిన రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుల గణనలో బీసీలకు సంబంధించిన నివేదికను తక్షణమే బహిర్గతం చేయాలని కోరారు.కేవలం నినాదాలతో కాకుండా, నిధులతో కూడిన చట్టబద్ధమైన బీసీ సబ్ ప్లాన్ ద్వారానే బీసీలకు నిజమైన సామాజిక న్యాయం సాధ్యమ వుతుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పెబ్బేరు మండలం టిఆర్పి పార్టీ నాయకులు పూజారి స్వామి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *