సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 6 భద్రాచలం రిపోర్టర్ గడ్డం సుధాకర్ రావు; భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాల సహజ సౌందర్యాన్ని తన కెమెరాలో బంధించి, ప్రపంచానికి పరిచయం చేసిన అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన ఫోటోగ్రాఫర్ క్లాసిక్ షరీఫ్ గారి 53వ జయంతి సందర్భంగా ఆయన మిత్రులు భద్రాచలంలోని స్థానిక అంబేడ్కర్ సెంటర్‌లో అన్నదానం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ భద్రాచలం ఆధ్వర్యంలో కొనసాగుతున్న “వీల్స్ ఆన్ ఫ్రీ మీల్స్” సేవా కార్యక్రమంలో భాగంగా ఈ అన్నదానం కార్యక్రమాన్ని వీరి సహాయ సహకారాలతో ఏర్పాటు చేశారు .ఈ సందర్భంగా వందలాది నిరుపేదలు, ప్రయాణికులు భోజనం స్వీకరించి నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మిత్రులు జక్కిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రంజిత్ నాయక్ భూక్యా, కొప్పుల మురళి మాట్లాడుతూ తమ మిత్రుడు క్లాసిక్ షరీఫ్ అకాలమృతి చెందడం తమకు తీరని లోటుగా మారిందని, ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు. షరీఫ్ జీవితం కళకే కాదు, మానవ సేవకూ అంకితమైందని గుర్తు చేస్తూ, ఆయన ఆశయాలను కొనసాగిస్తూ సమాజ సేవలో ముందుండేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ భద్రాచలం అధ్యక్షుడు కమల రాజశేఖర్, కార్యదర్శి సిద్ధారెడ్డి, క్లబ్ సభ్యులు భీమవరపు వెంకట్ రెడ్డి, బాలానర్స రెడ్డి, డా. కృష్ణ ప్రసాద్, జిందా, మమతా, సంతోష్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.