సాక్షి డిజిటల్ న్యూస్, రిపోర్టర్ బొక్కా నాగేశ్వరరావు, జనవరి 3 2026, ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం పెండ్యాల దేశానికే ఆదర్శంగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం భూ యాజమాన్య వ్యవస్థను మరింత పారదర్శకం గా, రైతుల శ్రేయస్సు లక్ష్యంగా తీర్చిదిద్దుతోందని.. ఆధునిక సాంకేతికత అనుసంధానంతో భూమి యాజ మాన్య హక్కు పత్రం, పట్టాదారు పుస్తకాలను రాజముద్రతో అందిస్తోందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. శుక్రవారం కంచికచెర్ల మండలం, పెండ్యాలలో జరిగిన రెవెన్యూ గ్రామసభలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ.. జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు. భూ యజమాను లకు హక్కు పత్రం, పట్టాదారు పుస్తకాలను ఈ-కేవైసీతో అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ భూ రికార్డుల డిజిటలైజేషన్, సాంకేతిక ఆధునికీకరణ డేటా ద్వారా భూ సంబంధిత వివాదాలకు చెక్‌పెట్టడంతో పాటు రైతులకు వేగవంతమైన సేవలు అందనున్నాయని వివరించారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు సరికొత్త పట్టాదారు పుస్తకాలు అందజేస్తున్నట్లు వెల్లడించారు. రోవర్లు వంటి ఆధునిక సాంకేతిక పరికరాలతో సర్వే జరగ్గా.. శాటిలైట్ టెక్నాలజీ, జియో కోడ్స్ అనుసంధానంతో రాజముద్రతో సరికొత్త పట్టాదారు పాసుపుస్తకాలను అందిస్తున్న ముఖ్యమంత్రి, ప్రభుత్వానికి భూ యజమానుల తరఫున ధన్య వాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. భూ సంబంధ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు, గ్రామాలను భూ వివాద రహితంగా మార్చేందుకు ఈ పాసుపుస్తకాలు దోహదం చేస్తాయని.. హద్దులను మార్చేయడం వంటి మోసాలు కుదరవని స్పష్టం చేశారు. వరదలు వంటి విపత్తులు వచ్చినా అత్యంత కచ్చితత్వంతో మన భూములు, మన హద్దులు భద్రంగా ఉంటాయని వివరించారు. కొత్త ఏడాదిలో ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందం కలిగిస్తోందన్నారు. భూ సమాచారం డేటా సెంటర్‌లో భద్రంగా ఉంటుందని.. ఈ డేటాతో రైతులు సత్వర సేవలు పొందేందుకు వీలుంటుందని కలెక్టర్ లక్ష్మీశ వివరించారు. గ్రామాన్ని ప్రగతి దిశగా నడిపించాలి: మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న పెండ్యాల గ్రామాన్ని మరింత ప్రగతి దిశగా నడిపించేందుకు సమష్టిగా కృషిచేయాలని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. జిల్లా స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయాలను పెంచేందుకు చేస్తున్న కృషిలో భాగస్వాములు కావాలన్నారు. అదేవిధంగా గ్రామంలో 33 శాతానికి పైగా హరిత విస్తీర్ణం పెంపునకు కూడా కృషిచేయాలని కలెక్టర్ లక్ష్మీశ కోరారు. కార్యక్రమంలో జిల్లా సర్వే అధికారి వై.మోహన్‌రావు, నందిగామ ఆర్‌డీవో కె.బాలకృష్ణ, గ్రామ సర్పంచ్ షబ్బీర్ పాషా, తహశీల్దార్ నరసింహారావు, ఎంపీడీవో వెంకటేశ్వరరావు, గ్రామ పెద్ద అలీ పాషా, రైతులు పాల్గొన్నారు. డీఐపీఆర్‌వో, ఐ అండ్ పీఆర్, ఎన్‌టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ