తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోండి

★రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డికి ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 3, వరంగల్, రిపోర్టర్ జన్ను కోర్నెలు గత కొంతకాలంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రాజకీయ కక్షలతో అమాయకులపై రాజకీయ ఒత్తిళ్లతో కేసులు పెట్టిన పోలీసు అధికారుల పై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి,ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య శుక్రవారం తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శివధర్ రెడ్డి ని కలిసి ఫిర్యాదు చేశారు. గత సంవత్సరం మార్చి మాసంలో కిలా వరంగల్ లో జరిగిన గొర్రెల దహనం ఘటనపై పోలీసులు ఇంతవరకు చర్య తీసుకోలేదని, నిందితులను కనిపెట్టి అరెస్టు చేయలేదని, అలాగే 2023 డిసెంబర్ నుంచి వరంగల్ తూర్పు నియోజకవర్గంలోనీ మూడు పోలీస్ స్టేషన్ల ఇంతసార్గంజ్, మట్టేవాడ, మీల్స్ కాలనీ స్టేషన్లలో కొందరు ప్రముఖులపై సామాన్య జనాలపై అక్రమంగా నమోదు చేసిన ఎస్సీ ఎస్టీ ఇతర కేసులపై పునః విచారణ చేయాలని, అలాగే తప్పుడు కేసులు పెట్టిన పోలీసు అధికారులపై తగు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందించారు. అలాగే పోలీసులు తమ విధుల్లో పారదర్శకత ప్రదర్శించాలని, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ, న్యాయ బద్ధంగా, ధర్మబద్ధంగా చర్యలు తీసుకోవాలని ఆ విధంగా పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర డిజిపి నీ కోరినారు. అలాగే, కొద్ది రోజుల క్రితం తప్పుడు కేసులు నమోదు చేసిన పోలీసు అధికారులపై శాఖ పరమైన చర్యలు తీసుకున్నందుకు గాను, బాధితుల పక్షాన వరంగల్ నగర ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. డిజిపి తీసుకున్న ఈ శాఖ పరమైన చర్యల వల్ల ప్రజలకు పోలీసులపై నమ్మకం కలిగిందని, సామాన్య ప్రజలు కూడా తమ ఫిర్యాదులపై న్యాయం జరుగుతుందని భరోసా ఏర్పడిందని ఎమ్మెల్సీ బస్వరాజు డిజిపి కి తెలిపారు.