సాక్షి డిజిటల్ న్యూస్: జనవరి 3 ( ప్రకాశం జిల్లా బ్యూరో ఇన్చార్జి: షేక్ మక్బూల్ బాషా). ప్రకాశం జిల్లా అద్దంకి సైబర్ నేరగాళ్లు సరికొత్త పంథాలో సామాన్యులను, చదువుకున్న వారిని కూడా నిలువునా ముంచేస్తున్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో ఒక రిటైర్డ్ బ్యాంకు అధికారిని లక్ష్యంగా చేసుకున్న కేటుగాళ్లు, 'డిజిటల్ అరెస్ట్' అనే నయా మోసంతో ఏకంగా రూ.1,23,00,000 (కోటి ఇరవై మూడు లక్షలు) స్వాహా చేశారు. బాధితుడైన రిటైర్డ్ బ్యాంకర్‌కు గుర్తుతెలియని వ్యక్తుల నుండి వీడియో కాల్ వచ్చింది. తాము ముంబై క్రైమ్ బ్రాంచ్ సిబిఐ అధికారులమని పరిచయం చేసుకున్నారు. మీ ఆధార్ కార్డు ద్వారా భారీ ఎత్తున మనీ లాండరింగ్ జరిగింది. తైవాన్ నుండి డ్రగ్స్ పార్శిల్స్ మీ పేరుతో వెళ్లాయి. దీనిపై సుప్రీంకోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది అని భయపెట్టారు. 24 గంటల వరకు 'డిజిటల్ అరెస్ట్'నిజమైన అధికారులుగానే నమ్మించిన నేరగాళ్లు, బాధితుడిని తన ఇంట్లోనే ఒక గదిలో ఉండాలని, ఎవరికీ ఫోన్ చేయకూడదని (డిజిటల్ అరెస్ట్) ఆజ్ఞాపించారు. స్కైప్ (Skype) ద్వారా 24 గంటల పాటు ఆయనను వీడియో పర్యవేక్షణలో ఉంచారు. కేసు నుంచి బయటపడాలంటే తమ 'సెక్యూరిటీ అకౌంట్'కు డబ్బు పంపాలని, దర్యాప్తు తర్వాత తిరిగి ఇస్తామని నమ్మబలికారు. దీంతో భయాందోళనలకు గురైన బాధితుడు తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొదుపు మొత్తాన్ని విడతల వారీగా సుమారు రూ.1.23 కోట్లను వారు చెప్పిన ఖాతాల్లోకి బదిలీ చేశారు. తర్వాత వారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు 1930 సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. వెంటనే అద్దంకి టౌన్ పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేరింది. దీనిపై అద్దంకి సీఐ కేసు ఆప్తు చేస్తున్నారు.