అయ్యప్ప స్వామి ‘పంబారట్టు..’ మహోత్సవం

*ఘనంగా మణికంఠ స్వామి జలక్రీడా *శరంగోషాతో మార్మోగిన సూరారం గ్రామం *గరుడ రూపంలో వేడులకను తిలకించిన అయ్యప్ప స్వామి

(సాక్షి డిజిటల్ న్యూస్, 03 జనవరి, మహాదేవపూర్ -తులసి మహేష్) అయ్యప్ప నామస్మరణతో సూరారం గ్రామం మారుమోగింది. అయ్యప్ప మాలధారణ భక్తులతో శుక్రవారం సందడిగా మారింది. అయ్యప్ప పంబారట్టు (జలక్రీడ) సమీపంలోని గోదావరిలో కన్నులపండువగా జరిగింది. జల క్రీడలో భాగంగా అయ్యప్ప స్వామికి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, బస్వం, పంచదార, గంధం, పసుపుతో అభిషేకం చేశారు. జయశంకర్ జిల్లా మహాదేవపూర్ మండలం సూరారం గ్రామంలో శుక్రవారం అయ్యప్ప పంబారట్టు ఉత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. కేరళ రాష్ట్రంలోని శబరిమలై సన్నిధానం సమీపంలోని పంబానదిలో ఏ విధంగా జరుగుతుందో అదే రీతిలో ఉత్సవాలు జరిపారు. సూరారం గ్రామం సమీపంలోని మేడిగడ్డ గోదావరిలో శుక్రవారం మధ్యాహ్నం 12.30 నుంచి సాయంత్రం 3.30 గంటల వరకు అయ్యప్ప పంబారట్టు(జల క్రీడ) ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. సమీపంలోని ఏర్పాటు చేసిన వేదికపై అయ్యప్ప విగ్రహాన్ని ప్రతిష్ఠించి శివాకేశవ ఆలయ అర్చకులు వంగల సత్యనారాయణ చారి మరియూ నాగరాజు శర్మ వేదమంత్రోచ్చరణల నడుమ అయ్యప్పస్వామిని కొలుస్తూ పాలు, పెరుగు, నెయ్యి, భస్మం(విభూది), పంచదార, చందనం, పసుపు, పండ్లు, తేనె, జలంతో వందలాదిగా తరలివచ్చిన భక్తుల సమక్షంలో అభిషేకం చేశారు. అభిషేక సమయంలో ఆకాశంలో గరుడ పక్షులు సంచరించడంతో అయ్యప్పస్వామి గరుడ రూపంలో వేడులకను తిలకించేందుకు వచ్చాడని చేతులు జోడించి స్వామియే శరణం అయ్యప్ప అంటూ స్మరించారు. కేరళలోని పంబా నదిలో అయ్యప్ప స్వామికి చేసే విధంగా, స్థానికంగా గోదావరి లేదా నదులలో నిర్వహించే ప్రత్యేక పూజా కార్యక్రమం. ఇది అయ్యప్ప భక్తికి, ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక ముఖ్యమైన ఘట్టం. శబరిమల యాత్రకు వెళ్లే ముందు, లేదా యాత్ర తరువాత భక్తిని చాటుకోవడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *