వందేమాతరం నినాదంతో మార్మోగిన చిత్తూరు జిల్లా

★వందేమాతరం రచించి 150 ఏళ్లు — దేశభక్తి గీతంతో ఐక్యత ప్రతిధ్వనించిన చిత్తూరు పట్టణం ★విద్యార్థులు, పోలీసులు, ప్రజలతో కలిసి ఘనంగా కార్యక్రమం – ఎస్.ఆర్. రాజశేఖర్ రాజు ఆవేశభరిత ప్రసంగం

సాక్షి డిజిటల్ న్యూస్, నవంబర్ 8 చిత్తూరు పట్టణం (రిపోర్టర్ జయచంద్ర): భారతీయుల గుండెల్లో ఎప్పటికీ ఆరని జ్యోతి “వందేమాతరం” ఆ జాతీయ గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో చిత్తూరు జిల్లా అంతటా దేశభక్తి నినాదాలతో మార్మోగింది. జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS గారి ఆదేశాల మేరకు చిత్తూరు పట్టణంలోని గాంధీ కూడలి వద్ద జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 1000 మంది విద్యార్థులు, పోలీసు అధికారులు, సిబ్బంది మరియు ప్రజలు పాల్గొని ఏకస్వరంగా “వందేమాతరం”ను ఆలపించారు. నినాదాలతో నిండిన ఆ గీతం చిత్తూరు ఆకాశాన్నే తాకినట్లుగా కనిపించింది. “వందేమాతరం – మన స్వాతంత్ర్య స్ఫూర్తి, ఐక్యత ప్రతీక”
ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ మరియు ఇంచార్జ్ అడ్మిన్ శ్రీ ఎస్.ఆర్. రాజశేఖర్ రాజు గారు మాట్లాడుతూ వందేమాతరం అనేది దేశభక్తి యొక్క నినాదం మాత్రమే కాదు, అది మన మనసుల్లో దేశమంటే ఏమిటో గుర్తుచేసే శక్తి. బంకిమ్ చంద్ర చటర్జీ గారు రచించిన ఈ గీతం స్వాతంత్ర్య ఉద్యమంలో కోట్లాది భారతీయులలో ఆత్మవిశ్వాసాన్ని, త్యాగస్ఫూర్తిని నింపింది,” అన్నారు.వందేమాతరం అనేది మన దేశం పట్ల గల గౌరవం, ప్రేమ, సేవాస్ఫూర్తి ప్రతీక. ఈ రోజు విద్యార్థులు, పోలీసులు, ప్రజలు ఒకే గళంలో ఆలపించడం మన ఐకమత్యాన్ని ప్రతిబింబించింది,” అని చెప్పారు. దేశభక్తి జ్వాలలు రగిలించిన గీతం – గర్వంతో నిండిన హృదయాలు జిల్లా వ్యాప్తంగా వందేమాతరం గీతం ప్రతిధ్వనిస్తూ దేశభక్తి వాతావరణాన్ని సృష్టించింది.
“వందేమాతరం పాడినప్పుడు మన హృదయం గర్వంతో నిండాలి, ఎందుకంటే అది మన భారతీయతకు ప్రతీక” అని ఎఎస్‌పీ రాజశేఖర్ రాజు పేర్కొన్నారు. బంకిమ్ చంద్ర ఛటర్జీ వంటి మహనీయుడు ఇచ్చిన స్ఫూర్తిని గుర్తుచేసుకుంటూ, దేశ ఐక్యత కోసం అందరం కలిసి నడవాలని ఆయన పిలుపునిచ్చారు.
1000 మంది విద్యార్థులు, పోలీసులు, ప్రజలతో జాతీయ గీతం ఆలాపన గాంధీ కూడలి వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు త్రివర్ణ పతాకాలు ఊపుతూ దేశభక్తి నినాదాలతో వేదికను మార్మోగించారు. జిల్లా పోలీసు బృందం సమన్వయంతో నిర్వహించిన ఈ కార్యక్రమం జిల్లా ప్రజల్లో గర్వభావనను రేకెత్తించింది.