సాక్షి డిజిటల్ న్యూస్: నవంబర్ 8 ( ప్రకాశం జిల్లా బ్యూరో ఇన్చార్జి: షేక్ మక్బూల్ బాషా) “వందేమాతరం” గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా, ఒంగోలు పోలీస్ గ్రౌండ్‌లో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ హాజరై, పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు విద్యార్థులతో కలిసి వందే మాతరం గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ “వందేమాతరం” అంటే ‘తల్లి, నేను నీకు నమస్కరిస్తున్నాను’ అని అర్థమన్నారు. మన మాతృభూమికి అంకితమైన ఈ గీతం భారత స్వాతంత్ర్య ఉద్యమానికి ప్రేరణగా నిలిచింది.1870లలో “బంకిమ్ చంద్ర ఛటర్జీ” సంస్కృతీకరించిన బెంగాలీ భాషలో రచించిన ఈ గీతం 1882లో ఆనందమఠంలో ప్రచురితమైంది. భారత తత్వవేత్త “అరబిందో” దీన్ని ‘బెంగాల్ జాతీయ గీతంగా పేర్కొన్నారు.1896లో భారత జాతీయ కాంగ్రెస్ సభలో “రవీంద్రనాథ్ ఠాగూర్” ఈ గీతాన్ని మొదటిసారి పాడగా, 1905లో ఇది స్వాతంత్ర్య సమరయోధుల నినాదంగా మారి దేశవ్యాప్తంగా దేశభక్తిని రగిలించింది.1937లో కాంగ్రెస్ పార్టీ ఈ గీతంలోని మొదటి రెండు పద్యాలను భారత జాతీయ గీతంగా అధికారికంగా ప్రకటించింది. బ్రిటిష్ పాలనలో ఇది విప్లవాత్మకంగా మారడంతో “వందేమాతరం” పాట మరియు ఆనందమఠం నవల నిషేధించబడ్డాయి.1947లో స్వాతంత్ర్య వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం ఆ నిషేధాన్ని రద్దు చేసింది.1950లో రాజ్యాంగ సభ “వందేమాతరం”ను గణతంత్ర జాతీయగీతం గా స్వీకరించింది. అప్పటి రాష్ట్రపతి డా. రాజేంద్ర ప్రసాద్ దీన్ని “జనగణమన”తో సమాన గౌరవంతో పరిగణించాలన్నారు. “వందేమాతరం” భారత దేశ ఏకతా, గౌరవం, మరియు స్వాతంత్ర్యానికి చిహ్నంగా నిలిచిన శాశ్వత దేశభక్తి గీతమని, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ సమస్త జాతినీ ఒక్కటి చేసిన ఆ సమర నినాదానికి సరిగ్గా 150 ఏళ్ళు. ఇది మనందరికీ గర్వకారణం. దేశభక్తిని, జాతీయ స్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో, పోలీసు సిబ్బంది, విద్యార్థులు అంతా ఏకమై “వందేమాతరం” గీతాన్ని ఆలపించారు. అనంతరం విద్యార్థులకు జిల్లా ఎస్పీ చాకెట్లు పంచి పెట్టారు. అదే విధంగా జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీస్ అధికారులు మరియు సిబ్బంది ఈ కార్యక్రమమును ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, ఎఆర్ డిఎస్పీ కె.శ్రీనివాసరావు, ఒంగోలు టౌన్ సీఐ లు వై.నాగరాజు, యం.శ్రీనివాసరావు, టి.విజయకృష్ణ, ఒంగోలు రూరల్ సీఐ యన్. శ్రీకాంత్ బాబు, ఆర్ఐలు రమణ రెడ్డి, సీతారామిరెడ్డి, సురేష్, ఎస్సైలు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.