సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్.7 బి.కొత్తకోట రిపోర్టర్ చక్రపాణి. గత ప్రభుత్వ హయాంలో బి.కొత్తకోట పట్టణానికి చెందిన పేదలకు పంపిణీ చేసిన ఇంటి నివేశస్థల పట్టాలకు స్థలాలు చూపాలని డిమాండ్ చేస్తూ,భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బి.కొత్తకోట మండల సమితి ఆధ్వర్యంలో, గురువారం ఉదయం 10 గంటలకు మండల తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ తంబళ్లపల్లె నియోజకవర్గపు కార్యదర్శి ఎస్.మనోహర్ రెడ్డి, మండల కార్యదర్శి జి. రఘునాథ్,మైనార్టీ సంఘం యువ నాయకులు ఫయాజ్ లు మాట్లాడుతూ;సిపిఐ ఆధ్వర్యంలో,అనేకసార్లు చేసిన పోరాటాల ఫలితంగా గత ప్రభుత్వ హయాంలో బి.కొత్తకోట పట్టణంలోని సుమారు 1000 మందికి పైగా పేద మహిళలకు కొందరికి బి.కొత్తకోట పట్టణ పరిధిలోని బద్దిపల్లి సమీపంలోనూ,మరికొందరికి బీరంగి గ్రామ సర్వేనెంబర్ 59 లోనూ ఇంటి నివేశ స్థల పట్టాలు మంజూరుచేసి,20-02-2024 వ తేదిన బి.కొత్తకోట నగర పంచాయతీ ఆవరణంలో పెద్ద బహిరంగ సభను నిర్వహించి,మండల అధికారులు,ప్రజా ప్రతినిధులు అందరూ కలిసి అధికారికంగా పట్టాలు లబ్ధిదారులకు పంపిణీ చేశారాన్నారు.అయితే ఎన్నికలు రావడం వలన సదరు లబ్ధిదారులకు స్థలాలు చూపలేదని,తరువాత ప్రభుత్వం మారడం వలన సదరు లబ్ధిదారులకు స్థలాలు చూపడంలో ప్రస్తుత ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదన్నారు.ప్రస్తుత రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా,ఇంటి స్థలాల కొరకు మరియు సొంత స్థలాలు ఉన్నవారికి ఆర్థిక సాయం కొరకు అర్హులైన వారు సచివాలయాలలో దరఖాస్తులు సమర్పించమని ప్రకటించిందని,అయితే గతంలో పట్టాలు లబ్ధి పొందిన వారి పేర్లు ఆన్ లైన్ లో నమోదు అయి ఉన్న కారణంగా ప్రస్తుతం దరఖాస్తులను ఆన్ లైన్ స్వీకరించడం లేదని,సదరు లబ్ధిదారులకు స్థలాలైనా చూపండి..లేదా గతంలో ఇచ్చిన పట్టాలైనా రద్దు చేసి వాటి స్థానంలో కొత్తగా పట్టాలు మంజూరు చేయాలని మండల అధికారులకు అనేకసార్లు లబ్ధిదారులు మొరపెట్టుకున్నాకూడా ప్రయోజనం లేదని వాపోయారు.వెంటనే అర్హులైన వారందరికీ ఇంటినివేశస్థల పట్టాలు మంజూరు చేసి,ఆర్థిక సాయం అందజేయాలని డిమాండ్ చేశారు.అనంతరం మండల తహసిల్దార్ బాబాజాన్ బైఠాయించిన మహిళల వద్దకు వచ్చి,పట్టాల జాబితాలతో కూడిన వినతి పత్రాలను తీసుకొని,జిల్లా కలెక్టర్ గారికి తెలియజేసి వారి సూచనల మేరకు లబ్ధిదారులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.ఈకార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి ఎం.అష్రఫ్అల్లీ,నాయకులు జి.నారాయణ స్వామి,యస్.ఖాదర్ బాషా,వి.సుధాకర్,బావాజాన్ మరియు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.