ఆవిష్కరణలతోనే ఆరోగ్య రంగం ప్రగతి సాధ్యం

★ఐఐఎం లక్నో ప్రొఫెసర్‌ డా. ఎస్‌. వెంకటరామయ్య

సాక్షి డిజిటల్ న్యూస్, నవంబర్ 6చిత్తూరు టౌన్ రిపోర్టర్ జయచంద్ర: ఆరోగ్య రంగం వేగంగా మారిపోతున్న ఈ యుగంలో, ఆవిష్కరణలతో కూడిన సమర్థవంతమైన నిర్వహణే విజయానికి మార్గమని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) లక్నో ప్రొఫెసర్‌ డా. ఎస్‌. వెంకటరామయ్య అన్నారు. ఆపోలో యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ ఆధ్వర్యంలో గురువారం “ఆరోగ్య నిర్వహణలో ఆవిష్కరణలు” అన్న అంశంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక ఉపన్యాసంలో ఆయన విద్యార్థులకు మార్గదర్శక సూచనలు ఇచ్చారు. డా. వెంకటరామయ్య ఉపన్యాసం విద్యార్థుల్లో కొత్త ఆలోచనలకు దారితీసింది. హెల్త్‌కేర్ రంగం భవిష్యత్తు పూర్తిగా ఇన్నోవేషన్‌, టెక్నాలజీ, మేనేజ్‌మెంట్‌ సమన్వయంపై ఆధారపడి ఉంటుంది అని ఆయన పేర్కొన్నారు. రోగి కేంద్రిత సేవలు, డేటా ఆధారిత నిర్ణయాలు, డిజిటల్‌ హెల్త్‌ మోడల్స్‌ ద్వారా భారతీయ ఆరోగ్య వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు సాధ్యమవుతాయని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ డీన్‌ ప్రొఫెసర్‌ డా. రామయ్య ఇతుమల్ల సమన్వయంతో, ఎంబీఏ హాస్పిటల్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నిర్వహించారు. విద్యార్థులు చురుకుగా పాల్గొని, ప్రొఫెసర్‌ వెంకటరామయ్యతో హెల్త్‌కేర్‌ ఇన్నోవేషన్స్‌, మేనేజ్‌మెంట్‌ ప్రాక్టీసెస్‌, కెరీర్‌ అవకాశాలపై చర్చించారు. ఈ ఇంటరాక్టివ్‌ సెషన్‌ విద్యార్థుల్లో విశ్లేషణాత్మక దృష్టి, ప్రాక్టికల్‌ అవగాహన, మరియు నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించింది. యుకె ప్రొఫెసర్‌ ఆన్‌లైన్‌ ఉపన్యాసం “సాహిత్యంలోని రహస్య సంకేతాలను కృత్రిమ మేధస్సు విప్పగలదా?” ఈ ఆలోచన చుట్టూ యూనివర్సిటీ ఆఫ్‌ లీసెస్టర్‌ (యూకే) ప్రొఫెసర్లు, ది అపోలో విద్యార్థుల మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. యూనివర్సిటీ ఆఫ్‌ లీసెస్టర్‌ (యూకే)కు చెందిన ప్రముఖ అకాడమిషియన్‌ ప్రొఫెసర్‌ హుయ్యూయ్‌ జో గురువారం బి.ఇంగ్‌ – కంప్యూటర్‌ సైన్స్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు “మెషీన్లు డికెన్స్‌ కోడ్‌ను విప్పగలవా?” అనే అంశంపై వర్చువల్‌ అతిథి ఉపన్యాసం ఇచ్చారు. సాంకేతిక విజ్ఞానం, సాహిత్యం, భాషా శాస్త్రం కలయికలో కొత్త ఆవిష్కరణలు ఎలా పుడతాయో ఆయన ఆసక్తికరంగా వివరించారు. కృత్రిమ మేధస్సు, మెషిన్‌ లెర్నింగ్‌ రంగాల్లో విశేష పరిశోధన అనుభవం కలిగిన ప్రొఫెసర్‌ హుయ్యూయ్‌ జో తన ఉపన్యాసంలో ప్రపంచ ప్రసిద్ధ నవలా రచయిత చార్లెస్‌ డికెన్స్‌ వాడిన షార్ట్‌హ్యాండ్‌ కోడ్‌ల వెనుక దాగి ఉన్న సాహిత్య, సాంకేతిక విశేషాలను ఆసక్తికరంగా వివరించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్‌ వివేకానందన్‌ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఉపన్యాసం ముగిసిన అనంతరం విద్యార్థులు ప్రొఫెసర్‌ జోతో నేరుగా చర్చించి, సాహిత్య పరిశోధనల్లో కృత్రిమ మేధస్సు వినియోగంపై పలు ప్రశ్నలు అడిగి విలువైన అవగాహనను పొందారు.