విధి నిర్వహణలో మరణించిన కానిస్టేబుళ్ల కుటుంబాలకి పోలీసుల ఆర్థిక చేయూత

★మరణించిన సహోద్యోగుల కుటుంబానికి పోలీస్ సిబ్బంది బాసటగా నిలవడం అభినందనీయం: ప్రకాశం జిల్లా ఎస్పీ"వి.హర్షవర్ధన్ రాజు".

సాక్షి డిజిటల్ న్యూస్: నవంబర్ 6 ( ప్రకాశం జిల్లా బ్యూరో ఇన్చార్జి: షేక్ మక్బూల్ బాషా). ప్రకాశం జిల్లా పోలీస్ శాఖలో స్పెషల్ పార్టీ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న దూదేకుల మాబు సుభానీ (పీసీ–1370, వయసు 31 సం) 2024 అక్టోబర్ 19న చీమకుర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. తన కుటుంబానికి ఆర్థిక చేయూతగా 2020 బ్యాచ్‌కు చెందిన పోలీసు సిబ్బంది మరియు స్పెషల్ పార్టీ, స్వాట్ టీమ్, పీఎస్ఓలు, ఏ ఆర్ సిబ్బంది స్వచ్ఛందంగా సేకరించిన రూ.2,46,000 ను మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ చేతుల మీదుగా అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ, మరణించిన కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ శాఖ ఎల్లప్పుడూ వారికి అండగా నిలుస్తుందని, ఏవైనా సమస్యలు ఉన్నా నేరుగా తనను సంప్రదించవచ్చని తెలిపారు. పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ చనిపోయిన పోలీసు సిబ్బంది కుటుంబాల సంక్షేమంకు అన్ని చర్యలు తీసుకొని వారికి అన్నీ విధాల అండగా ఉంటామని తెలిపారు. తమ సహోద్యోగులు విధి నిర్వహణలో మరణించిన కుటుంబానికి పోలీసు సిబ్బంది ఆర్థిక సహాయం అందించి అండగా నిలవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎఆర్ డిఎస్పీ కె.శ్రీనివాసరావు, ఆర్ఐలు రమణ రెడ్డి, సీతారామిరెడ్డి, డి.సురేష్, సిబ్బంది, మరణించిన సుభానీ తండ్రి దూదేకుల వల్లి, తమ్ముడు శేషావల్లి పాల్గొన్నారు.