విద్యార్థులతో పెట్టుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయి

★మెడికల్ కళాశాల పిపిపి విధానం రద్దు చేయాలి – ఏఐఎస్ఎఫ్ ★ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.6400 కోట్లు విడుదల చేయాలని డిమాండ్

సాక్షి డిజిటల్ న్యూస్, నవంబర్ 6 చిత్తూరు టౌన్ (రిపోర్టర్ జయచంద్ర): ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న విద్యారంగ సమస్యల పరిష్కార బస్సు యాత్ర 15వ రోజు చిత్తూరు చేరుకుంది. ఈ సందర్భంగా కలెక్టరేట్ వద్ద రాష్ట్ర సహాయ కార్యదర్శి బండి చలపతి అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు. సభలో ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి శివారెడ్డి, తమిళనాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దినేష్, రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వలరాజు, నాసర్ జీ, రాష్ట్ర సహాయ కార్యదర్శి మస్తాన్ నాగభూషణం, జిల్లా కార్యదర్శి ప్రవీణ్ కుమార్, ఆంధ్ర యూనివర్సిటీ కార్యదర్శి అభి, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంపై మండిపడ్డ నేతలు నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో విద్యార్థులకు అనేక హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం, వాటిలో ఒక్కటీ అమలు చేయలేదని తీవ్రంగా విమర్శించారు. “మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే నెలరోజుల్లో రూ.6400 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. కానీ ఒకటిన్నర సంవత్సరం గడిచినా కేవలం పేపర్ ప్రకటనలకే పరిమితమైంది” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై తీవ్ర విమర్శలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తోందని గతంలో తీవ్రంగా విమర్శించిన నారా లోకేష్, ఇప్పుడు తానే అధికారంలోకి వచ్చాక 100% ప్రైవేటీకరణ చేయడం ఆశ్చర్యకరమని ఏఐఎస్ఎఫ్ నేతలు మండిపడ్డారు. “పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతోంది. ఇది విద్యా వ్యతిరేక విధానం” అని అన్నారు. హాస్టల్స్‌లో దయనీయ పరిస్థితి ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు మౌలిక వసతులు లేక, సరైన ఆహారం అందడం లేదని వాపోయారు. “గదులు, బాత్రూములు లేవు. పెరిగిన ధరలకు అనుగుణంగా మేస్ ఛార్జీలు, కాస్మొటిక్ ఛార్జీలు పెంచాలి” అని డిమాండ్ చేశారు. జీవో 77 రద్దు ఎప్పుడు? వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 77ని వందరోజుల్లో రద్దు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పటికీ అమలు చేయలేదని గుర్తు చేశారు. “ఖాళీగా ఉన్న టీచర్, లెక్చరర్, ప్రొఫెసర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి” అని కోరారు. విద్యార్థులతో పెట్టుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయి" విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి న్యాయం చేయకుండా, విదేశాల పర్యటనల్లో మునిగిపోయి విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. “రాష్ట్రంలో విద్యార్థులతో పెట్టుకుంటే ప్రభుత్వాలు కూలిపోయిన చరిత్ర ఉంది. కూటమి ప్రభుత్వం విద్యా వ్యతిరేక విధానాలు మార్చకపోతే విద్యార్థులే ముందుండి ఆ ప్రభుత్వాన్ని కూలగొడతారు” అని హెచ్చరించారు. అనంతపురంలో ముగింపు సభ ఈనెల 12న అనంతపురంలో బస్సు యాత్ర ముగింపు సభ నిర్వహిస్తామని, అనంతరం రాష్ట్రవ్యాప్తంగా సమరశీల పోరాటాలు ప్రారంభిస్తామని ఏఐఎస్ఎఫ్ నేతలు ప్రకటించారు. సభలో సిపిఐ నాయకులు మనీ, గోపీనాథ్, దాసరి చంద్ర, విజయ్ కుమార్, గుర్రప్ప, రమాదేవి, విజయ గౌరీ, జమీలబీ, కోమల, లతారెడ్డి, రఘు తదితరులు పాల్గొన్నారు.