సీతమ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో విషాదం

★బీటెక్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి రుద్ర ఆత్మహత్యతో కలకలం ★వారంలో రెండో ఘటనతో విద్యార్థుల ఆందోళన

చిత్తూరు డిజిటల్ న్యూస్, నవంబర్ 4, చిత్తూరు టౌన్ (రిపోర్టర్, జయచంద్ర): చిత్తూరు జిల్లా పుత్తూరు సమీపంలోని సీతమ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. బీటెక్ రెండవ సంవత్సరం విద్యార్థి రుద్ర (20) మంగళవారం మధ్యాహ్నం కళాశాల మూడో అంతస్తు పై నుండి దూకి ప్రాణాలు కోల్పోయాడు. సహ విద్యార్థులు, సిబ్బంది గమనించి వెంటనే అతన్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి రుద్ర ఇప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. వారంలో రెండో దారుణం
ఇదే కళాశాలలో నాలుగు రోజుల క్రితం విద్యార్థిని నంది రెడ్డి కూడా కళాశాల భవనం పై నుండి దూకి తీవ్ర గాయాలపాలైంది. ప్రస్తుతం ఆమె వేలూరులో చికిత్స పొందుతోంది. వరుస ఘటనలతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కారణాలు ఇంకా తెలియరాలేదు రుద్ర ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. విద్యార్థి వ్యక్తిగత సమస్యా? లేక కళాశాల ఒత్తిడి కారణమా? అనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. కళాశాల అధికారులు “విషయం తెలుసుకొని పూర్తి వివరాలు వెల్లడిస్తాం” అని తెలిపారు. విద్యార్థుల ఆగ్రహం – భద్రతపై ప్రశ్నలు తాజా ఘటనతో విద్యార్థులు కళాశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “ఒక వారంలో రెండుసార్లు ఇలాంటి ఘటనలు జరగడం తీవ్రమైన భద్రతా లోపం” అని వారు ఆరోపిస్తున్నారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని, కౌన్సిలింగ్ సదుపాయాలు కల్పించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది చిత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రుద్ర మొబైల్ ఫోన్, స్నేహితుల వాంగ్మూలాలు, సీసీ కెమెరా దృశ్యాలను సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.