మాస్టర్ ప్లాన్ రూపకల్పన సమర్థవంతంగా చేపట్టాలి

★కలెక్టర్ జితేష్ వి. పాటిల్

సాక్షి డిజిటల్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రాము నాయక్ (నవంబర్ :5) అమృత్ 2.0 పథకం కింద జీఎస్‌ఐ ఆధారిత మాస్టర్ ప్లాన్ రూపకల్పనను సమర్థవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సూచించారు. ఇందుకోసం అవసరమైన ఖచ్చితమైన వివరాలను సంబంధిత శాఖల అధికారులు సమయానికి అందించాలని ఆయన ఆదేశించారు. మంగళవారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో డీటీసీపీ ప్రాజెక్ట్ డైరెక్టర్ అశ్విని ఆధ్వర్యంలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై మొదటి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాస్టర్ ప్లాన్ రూపొందించడం భవిష్యత్ పట్టణాభివృద్ధికి మార్గదర్శకం. అందువల్ల ప్రతి శాఖ ఖచ్చితమైన తాజా సమాచారాన్ని అందించాలి అని అన్నారు. రెవెన్యూ శాఖ నుంచి లభించే సర్వే నంబర్లు వాటి పరిధులు భూమి వినియోగ వివరాలు కీలకమని అవి మాస్టర్ ప్లాన్‌కు ఆధారంగా ఉంటాయని తెలిపారు. త్రాగునీటి సరఫరా అంశంపై ప్రజారోగ్య మరియు మిషన్ భగీరథ అధికారుల సమన్వయంతో సమగ్ర సమాచారం అందించాలని సూచించారు. రోడ్లు భవనాలు శాఖ అధికారులు ప్రస్తుత రహదారులతో పాటు బైపాస్ రహదారుల నిర్మాణానికి అనువైన ప్రదేశాలను సూచించాలని ఆదేశించారు. అటవీ, విద్యుత్, రవాణా రైల్వే పరిశ్రమలు తదితర శాఖలు తమ పరిధిలోని అన్ని వివరాలను సమగ్రంగా సమర్పించాలన్నారు.
అన్ని ప్రభుత్వ కార్యాలయాల స్థానాలను కూడా మాస్టర్ ప్లాన్‌లో ప్రతిబింబించాలన్నారు. పట్టణ ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకోవడమే కాకుండా వచ్చే ఇరవై సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రాదేశిక వివరాలను సేకరించాలని సూచించారు. డ్రోన్ టెక్నాలజీ ద్వారా డిజిటల్ మ్యాపింగ్ నిర్వహించి భూ వినియోగ మ్యాపులు రూపొందించవచ్చని తాజా డేటాను ఆధారంగా చేసుకుని ప్లాన్లను నవీకరించవచ్చని కలెక్టర్ తెలిపారు. సమగ్ర ప్రణాళిక ద్వారా భవిష్యత్ పట్టణాభివృద్ధికి అవసరమైన భూమి వినియోగం, భవన నిర్మాణం, రవాణా మరియు ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి దోహదపడుతుందని వివరించారు.
జనాభా పెరుగుదల మరియు పట్టణ విస్తరణను దృష్టిలో ఉంచుకుని ప్రజల అవసరాలకు అనుగుణంగా గృహాలు త్రాగునీరు, రహదారులు మరియు ఇతర సదుపాయాలను ప్రణాళికాబద్ధంగా కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రక్రియను ఆర్‌డిఓలు మరియు తహసీల్దార్లు పర్యవేక్షించాలన్నారు.
సమగ్ర సమాచారం ఆధారంగా డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ రూపొందించబడుతుందని కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ సౌరభ్ శర్మ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్ ఆర్‌డిఓ మధు సి పి ఓ సంజీవరావు మున్సిపల్ కమిషనర్ సుజాత, మరియు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.