సాక్షి డిజిటల్ న్యూస్ : 4 నవంబర్ 2025 తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్చార్జి రమేష్ బాబు ( రాము) రాయచోటి, నవంబర్ 04: కార్తీక పౌర్ణమి (బుధవారం) సందర్భంగా అన్నమయ్య జిల్లా ప్రజలు భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ కోరారు. ముఖ్యంగా నదీ స్నానాలు, దేవాలయాల సందర్శనల విషయంలో భక్తులు తప్పక పాటించాల్సిన కీలక సూచనలను ఎస్పీ విడుదల చేశారు.
నదీ స్నానాల భద్రత: భారీ వర్షాల కారణంగా నదుల్లో ప్రవాహం ఉధృతంగా ఉంది. ఈ విషయమై ఎస్పీ ఇచ్చిన ప్రధాన సూచనలు: ఒడ్డుకే పరిమితం:లోతు తక్కువ ఉన్న సురక్షిత ప్రాంతంలోనే స్నానం చేయాలి. సుడులు, ప్రమాదకర లోతు ఉన్న ప్రాంతాలకు వెళ్లవద్దు. దీపాలు వదిలేటప్పుడు: మహిళలు/భక్తులు ఒడ్డున నిలబడి మాత్రమే దీపాలు వదలాలి. గట్టు జారే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా నడవాలి. పిల్లలపై నిరంతర పర్యవేక్షణ: పిల్లలను ఒక్క క్షణం కూడా ఒంటరిగా వదలవద్దు, వారు నీటిలోకి దిగకుండా తల్లిదండ్రులు నిశితంగా గమనించాలి. పోలీసులకు సహకరించండి: నదులు,దేవాలయాల వద్ద మీ భద్రత కోసం ఉన్న పోలీసుల సూచనలను తప్పక పాటించాలి. ఆలయాలలో క్రమశిక్షణ, క్యూ లైన్లలోనే వెళ్లండి: రద్దీగా ఉండే ఆలయాలు, ఘాట్ల వద్ద తోపులాటలు, తొక్కిసలాటలు జరగకుండా క్రమశిక్షణతో క్యూ లైన్లలో మాత్రమే ముందుకు సాగాలి. గుంపులుగా వెళ్లవద్దు. అగ్ని ప్రమాదాల జాగ్రత్త: పూజలు నిర్వహించే సమయంలో షార్ట్ సర్క్యూట్‌లు జరగకుండా, దీపాల వల్ల అగ్ని ప్రమాదాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తడి ఇసుక/నీటిని సిద్ధంగా ఉంచుకోవాలి. జిల్లా ప్రజలు సురక్షితంగా, ప్రశాంతంగా కార్తీక పౌర్ణమి పండుగను జరుపుకోవాలని ఎస్పీ ఆకాంక్షించారు. అత్యవసర సహాయం కోసం తక్షణమే స్తానిక పోలీస్ స్టేషన్ లేదా డయల్ 112 కు కాల్ చేయాలని పేర్కొన్నారు.