సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ రామని గణేష్, ఇదిగనిపల్లి జడ్చర్ల నియోజకవర్గంలోని రాచాలపల్లి నుండి మాదారం వరకు రూ.2 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మాణం జరుగుతున్న రహదారి పనులను నేడు జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి ప్రారంభించారు. జడ్చర్ల ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి ద్వారా ప్రజలకు సౌకర్యాలు పెంపొందించడం ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ రహదారి పూర్తయ్యే సరికి రవాణా సౌకర్యం మెరుగై, రైతులు తమ పంట ఉత్పత్తులను సులభంగా మార్కెట్లకు తరలించుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు అభివృద్ధి పనుల పట్ల చూపుతున్న ఆనందం తనకు ప్రేరణగా ఉందని ఎమ్మెల్యే గారు అన్నారు. ప్రతి గ్రామం అభివృద్ధి దిశగా దృఢంగా ముందుకు సాగేందుకు తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.