అపోలో యూనివర్సిటీలో ఘనంగా కార్తీక వనసమారాధన, సాక్షి డిజిటల్ న్యూస్, నవంబర్ 3 , చిత్తూరు టౌన్(రిపోర్టర్ – జయచంద్ర): రాష్ట్ర ప్రభుత్వ అటవీ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్తీక వనసమారాధన కార్యక్రమంలో భాగంగా, ది అపోలో యూనివర్సిటీ ఎకో క్లబ్, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు సంయుక్తంగా ప్లాంటేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. యూనివర్సిటీ ప్రాంగణంలోని వివిధ గార్డెన్లో సోమవారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిత్తూరు వెస్ట్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎం. పట్టాభి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – ప్రకృతి పరిరక్షణకు, పచ్చదన విస్తరణకు ప్రతీకగా రాష్ట్ర ప్రభుత్వం వనసమారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 2029 నాటికి రాష్ట్రంలో 50 శాతం గ్రీన్ కవర్ సాధించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం మొక్కల పెంపకాన్ని ఉద్యమంలా కొనసాగిస్తోంది. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ చురుకుగా పాల్గొని ప్రకృతిని కాపాడాలి, అని పిలుపునిచ్చారు. తరువాత అతిథులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కార్తీక వనసమారాధనపై వక్తృత్వ పోటీలు నిర్వహించగా, విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో చిత్తూరు సెక్షన్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సి. కరణ్సింగ్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ హేమాద్రి రెడ్డి, ఎకో క్లబ్ ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ డా. ఎస్. ఫెరోజ్ బేగం, డీజీఎం(ఫెసిలిటీస్) అప్పూరావు, అధ్యాపకులు, విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.