సాక్షి డిజిటల్ న్యూస్: నవంబర్ 4 ( ప్రకాశం జిల్లా బ్యూరో ఇన్చార్జి: షేక్ మక్బూల్ భాష). ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కార్తీకమాసాన్ని పురస్కరించుకుని పాకాల, కొత్తపట్నం, మడనూరు,ఈతముక్కల సముద్రతీర ప్రాంతాల్లో పుణ్యస్నానాలు ఆచరించడానికి వచ్చే భక్తుల భద్రత కోసం ప్రకాశం జిల్లా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు.ప్రతి 50 మీటర్ల దూరాన్ని ఒక సెక్టార్‌గా విభజించి, రోప్స్ మరియు లైఫ్ జాకెట్లు ధరించిన పోలీస్ సిబ్బంది, గజ ఈతగాళ్లు, బోట్లలో పర్యవేక్షణ అధికారులు వంటి బలమైన భద్రతా చర్యలు చేపట్టారు. సముద్రపు నిర్దిష్ట లోతును గుర్తించి, ఆ పరిమితికి మించి ఎవరూ వెళ్లకుండా పోలీస్ సిబ్బంది ప్రజలను హ్యాండ్ మైక్‌ల ద్వారా హెచ్చరిస్తూ, ప్రమాద సూచిక బోర్డులు, సీసీటీవీ కెమెరాలు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు.అలాగే పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. ప్రజలు భక్తి భావంతో సురక్షితంగా పుణ్యస్నానం చేయడానికి పోలీసులు కృషి చేస్తున్నారు. ప్రకాశం జిల్లా పోలీసులు ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో ఎల్లప్పుడూ ముందుంటారని ప్రకాశం జిల్లా ఎస్పీ "వి.హర్షవర్ధన్ రాజు" తెలియజేశారు.