సాక్షి డిజిటల్ న్యూస్: నవంబర్ 3, ( ప్రకాశం జిల్లా బ్యూరో ఇన్చార్జి: షేక్ మక్బూల్ బాషా). దేశ భద్రత, సమాజ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా ప్రకాశం జిల్లా ఎస్పీ "వి.హర్షవర్ధన్ రాజు" ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు, సిబ్బంది శనివారం రాత్రి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ జిల్లా పోలీస్ కార్యాలయం నుండి కర్నూల్ రోడ్ కూడలి వద్ద ఉన్న పోలీస్ అమరవీరుల స్థూపం వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమర వీరుల ధైర్యం, త్యాగం, సేవలు అందరికీ ఆదర్శంగా నిలుస్తాయని, వారి త్యాగస్ఫూర్తి భవిష్యత్ తరాలకు దేశభక్తి, కర్తవ్యనిబద్ధతకు ప్రేరణగా నిలుస్తుందని, పోలీస్ అమరవీరుల త్యాగఫలాన్ని సమాజం ఎప్పటికీ గుర్తుంచుకోవాలని, సమాజ భద్రత, దేశ ఐకమత్యం కాపాడడంలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమని, పోలీసు శాఖ ఎల్లప్పుడూ ప్రజలతో కలిసి సామాజిక ఐక్యతకు కట్టుబడి ఉంటుందని పోలీస్ అధికారులు తెలిపారు. ఈ ర్యాలీలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొని అమరుల స్ఫూర్తిని స్మరించారు. అనంతరం అమరవీరుల స్థూపం వద్ద కోవ్వొత్తులు వెలిగించి, ఘన నివాళులర్పిస్తూ, ప్రజాస్వామ్య పరిరక్షణకు, సమాజ శ్రేయస్సుకై అహర్నిశలు పోరాడిన పోలీసు అమరుల త్యాగానికి “ఇవే మా జోహార్లు” అంటూ నివాళులర్పించారు. పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ ప్రకాశం జిల్లా పోలీసులు బ్యాండ్ షో కార్యక్రమం నిర్వహించారు.వైవిధ్య వాయిద్యాలతో దేశభక్తి గేయాలు, పోలీస్ గీతాలు ఆలపిస్తూ ప్రకాశం జిల్లా పోలీసులు ప్రజలను ఆకట్టుకున్నారు.అనంతరం పోలీసులు ఒంగోలులోని అద్దంకి బస్టాండ్ సెంటర్ వద్ద అమరవీరుల మహోన్నతమైన త్యాగాలు స్మరించుకుంటూ అద్భుతమైన బ్యాండ్ షో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పోలీసు వాయిద్య బృందం పోలీసు శౌర్యాలకు సంబంధించి జాతీయ గీతాలాపన, దేశభక్తి గీతాలు వాయించి చూపరులను మరియు అక్కడకు విచ్చేసిన ప్రజలను అలరించారు.పోలీస్ బ్యాండ్ బృందాలు వైవిధ్య వాయిద్యాల ద్వారా చక్కటి లయబద్ధమైన దేశ భక్తి గీతాలు, పోలీస్ గీతాలను ఆలపిస్తూ పోలీసు అమరవీరుల యొక్క త్యాగాలను, వారి సేవలను గురించి ప్రజలకు వ్యక్తపరిచారు. అసువులు బాసిన పోలీస్ అమరవీరులందరికీ ఈ ప్రదర్శనను అంకితమని, ప్రజా సేవ కోసం నిరంతరం ముందుండి రక్షణ కల్పించేది పోలీస్ శాఖనని, వ్యక్తిగత ఇబ్బందులు ఎదురైనా విధులు నిర్వర్తిస్తూ పోలీసులు చేస్తున్న త్యాగాలను ఎప్పటికీ మర్చిపోకూడదని పోలీసులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, ఎఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, ఒంగోలు టౌన్ సీఐ లు నాగరాజు, శ్రీనివాసులు, విజయకృష్ణ,ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ బాబు,ట్రాఫిక్ సీఐ పాండు రంగారావు, ఆర్ఐలు రమణ రెడ్డి, సీతారామిరెడ్డి, ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.