సాక్షి డిజిటల్ న్యూస్, నవంబర్ 01, (శేరిలింగంపల్లి): విద్యార్థులు మాదకద్రవ్యాలు, ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలని చట్టాల పట్ల అవగాహన పెంచుకోవాలని మియాపూర్ ఏసీపీ సీహెచ్. వై. శ్రీనివాస్ కుమార్ సూచించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ప్రిన్సిపల్ రవీందర్ అధ్యక్షతన నిర్వహించిన ‘పోలీస్ చట్టాలు – విద్యార్థులకు అవగాహన’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ మైనర్లు వాహనాలు నడపకూడదని, మాదకద్రవ్యాలు, ర్యాగింగ్ వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని విద్యార్థులను హెచ్చరించారు. పోక్సో చట్టం మహిళల భద్రత కోసం తీసుకువచ్చిన కీలక చట్టమని, ఎవరు వేధింపులకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యార్థులు తమపై జరిగే ఏవైనా అఘాయత్యాల గురించి డయల్ 100 ద్వారా పోలీసులను సమాచారం ఇవ్వాలని సూచించారు. నేటి టెక్నాలజీ యుగంలో, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో, విద్యార్థులు సమకాలీన పరిజ్ఞానం సంపాదించాలని ఆయన పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐ డా. జి. జగన్నాథ్, ఎస్ఐలు ప్రియదర్శిని, గోపిరాజు, నారాయణ, యాదగిరి, లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో గీతాలాపనతో ఆకట్టుకున్న విద్యార్థినులు గీతామాధురి, విశ్వరూపులను ఏసీపీ శ్రీనివాస్ కుమార్ సన్మానించారు.