నవంబర్ 1 సాక్షి డిజిటల్ న్యూస్ సిద్దిపేట : ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. సిహెచ్. ధనరాజ్ సూచించారు. శనివారం ఆయన పుల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న వివిధ కార్యక్రమాల పనితీరును పరిశీలించిన ఆయన, ల్యాబ్‌లో నిర్వహిస్తున్న పరీక్షల విధానాన్ని తెలుసుకున్నారు. ఫార్మసీ గదిలో మందుల నిల్వలు, అత్యవసర మందుల లభ్యతను ఫార్మసీ అధికారిని అడిగి తెలుసుకున్నారు. తరువాత సమీపంలోని ఉపకేంద్రాన్ని సందర్శించి వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని పరిశీలించారు. పిల్లలు, గర్భిణీ స్త్రీలకు సకాలంలో టీకాలు వేస్తున్నారా అనే విషయంపై సిబ్బందిని ప్రశ్నించారు. ఈ సందర్భంగా సిబ్బందికి ఆయన పలు సూచనలు చేశారు. ప్రతి గర్భిణీ స్త్రీకి టి డి సూది మందు, అలాగే పిల్లలకు వయసును బట్టి అవసరమైన అన్ని టీకాలు 100 శాతం వేయాలని ఆదేశించారు. ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రై డే నిర్వహించాలని, వ్యాధుల తీవ్రతను బట్టి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. గర్భిణీ స్త్రీ నమోదు నుంచి ప్రసవం వరకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన సూచించారు. పాఠశాలలు, హాస్టళ్లను సందర్శించి విద్యార్థులకు వ్యక్తిగత, పరిసర పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. హాస్టళ్లలో ఆహారం నిల్వ గదులను పరిశీలించి, మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా తెలుసుకోవాలని ఆదేశించారు. కుక్క కాటు, పాముకాటు వంటి అత్యవసర వ్యాక్సిన్లు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని, సిబ్బంది సమయపాలన పాటించాలని ఆయన హెచ్చరించారు. సమయపాలన పాటించని ఉద్యోగులపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డా. వినోద్ బాబ్జి, డా. వైద్య సిబ్బంది, కవిత, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.