సాక్షి డిజిటల్ న్యూస్, నవంబర్ 1, చిత్తూరు టౌన్ (రిపోర్టర్ జయచంద్ర): జాతీయ గౌరవ దివాస్ శనివారం చిత్తూరులో ఘనంగా జరిగింది. గిరిజన స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండా జయంతి మరియు ఇతర గిరిజన వీరుల స్మరణార్థం స్థానిక కలెక్టరేట్ పి.జి.ఆర్.ఎస్. హాలులో, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, జాతీయ గౌరవ దివాస్ కార్యక్రమాలు చిత్తూరు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బిర్సా ముండా, అల్లూరి సీతారామరాజు, గాము ఘంటం దొర, గాము మల్లు దొర, బోనంగి పాండు పడల్, కుడుముల పెద్దబయ్యన్న, హనుమంతప్ప చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ “భారత ఆదివాసీ స్వాతంత్ర్య పోరాటానికి జెండా పట్టిన ధీశాలి బిర్సా ముండా చిన్న వయస్సులోనే బ్రిటీష్ పాలకుల దోపిడీకి వ్యతిరేకంగా లేచారు. ‘మన భూములు, మన జీవితం మన చేతుల్లోనే ఉండాలి’ అన్న ధైర్యవచనం చెప్పిన వీరుడు,” అని అన్నారు. ఆయుధాలకన్నా నమ్మకం, ఆత్మస్థైర్యం ఆయనకు ఆయుధమని పేర్కొన్నారు. బిర్సా ముండాను ప్రజలు ప్రేమతో “ధర్తీ ఆభా” (భూమాత పుత్రుడు) అని పిలిచేవారని గుర్తుచేశారు. ఆయన ఆశయాలు యువతకు మార్గదర్శకమని, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగస్ఫూర్తితో యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం గిరిజన వీరులను స్మరించుకుంటూ జాతీయ గౌరవ దివాస్ ఉత్సవాలు నవంబర్ 1 నుండి 15 వరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. బిర్సా ముండా సేవలను గుర్తించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆయన జయంతినే జాతీయ గౌరవ దివాస్‌గా ప్రకటించిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో గిరిజన జనాభా సుమారు 7 శాతం కాగా, చిత్తూరు జిల్లాలో 60 నుండి 70 వేల మంది వరకు గిరిజనులు ఉన్నారని వివరించారు. “ప్రతి గిరిజన కుటుంబం చదువుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని” కలెక్టర్ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ అధికారి మూర్తి, ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు వీ.రాజ్‌కుమార్, దేవరాజులు, శంకర్ మాదిగ, ధనశేఖర్, శేషాద్రి, మునుస్వామి, బీసీ సంక్షేమ అధికారి రబ్బానీ భాష, ఇతర అధికారులు, గిరిజన నాయకులు పాల్గొన్నారు.