సాక్షి డిజిటల్ న్యూస్ అక్టోబర్ 31, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతినిధి జి శ్రీనివాసరావు కొత్తపేట నియోజక వర్గం సమాజానికి అవసరమైన ప్రతీ సందర్భంలోనూ పోలీసులు అందిస్తున్న సేవలు,చేస్తున్న త్యాగాలు మరువలేనివని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. రావులపాలెం ఎంకేఆర్ ఫంక్షన్ హాల్ నందు జరిగిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఐపీఎస్, అదనపు ఎస్పీ అడ్మిన్ ఏవీఆర్ పిడి ప్రసాద్, కొత్తపేట డిఎస్పీ సుంకరమురళీ మోహన్,సిబ్బంది ఆధ్వర్యంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో ఎమ్మెల్యే బండారు మరియు ఆకుల రామకృష్ణ కలిసి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ దేశ సమగ్రత కోసం, రక్షణ కోసం, శాంతి భద్రతల కోసం, ప్రజల ధన,మాన ఆస్తి, ప్రాణ రక్షణ కోసం విధినిర్వహణలో అశువులు ధారపోసిన పోలీసు అమరవీరుల త్యాగానికి సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నామని, వారి త్యాగాలకు ఏమి ఇచ్చినా వెలకట్టలేమన్నారు. సమాజం భద్రంగా ఉండటానికి, శాంతి భద్రతలతో పరిఢవిల్లడానికి వారి కుటుంబాలను సైతం లెక్కచేయకుండా మనందరి రక్షణ కోసం పనిచేస్తున్న ఘనత పోలీసులదే అన్నారు.దాడులు జరిగినా, ప్రమాదాలు జరిగినా, ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు ఎదురైనా మేమున్నాం ప్రజల రక్షణ కోసం అని ముందు నిలబడేది పోలీసులేనన్నారు. విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు నివాళులర్పించడం గర్వించదగ్గ విషయమన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన రక్త దాన శిబిరంలో ఎస్పీ రాహుల్ మీనా స్వయంగా రక్తదానం చేశారని ప్రశంసించారు. రక్తదాన శిబిరంలో రక్తాన్ని దానం చేసిన పోలీసులను,విద్యార్థులను ప్రశంసించారు.రెండు రోజలు క్రితం వచ్చిన తుఫాను ఇబ్బందుల్లో సైతం పోలీసులు చేసిన సేవలను ఆయన గుర్తుచేశారు. విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఆలమూరు ఎస్సై దివంగత అశోక్, కానిస్టేబుల్ బ్లెస్సన్ సేవలను గుర్తుచేసుకుని కొనియాడారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్దిస్తూ మౌనం పాటించారు. పోలీసు అమరవీరులను స్మరించుకునే కార్యక్రమంలో తనను భాగస్వామిని చేసినందుకు పోలీసుశాఖకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
