ఆలూరు, అక్టోబర్ 31, సాక్షి డిజిటల్ న్యూస్:- మొంథా తుఫాను ప్రభావంతో ఇటీవల కురిసిన అధిక వర్షాల వల్ల దెబ్బతిన్న పత్తి పంటను ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి పరిశీలించారు. మండల పరిధిలోని అరికెర గ్రామంలో పంట పొలాలను పరిశీలించి రైతులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో భారీగా పెట్టుబడులు పెట్టి పంటలు వేసిన రైతులకు పంట చేతికందే సమయంలో తుఫానుల ప్రభావం వల్ల తీవ్ర నష్టం వాటిల్లిందని, వర్షాల వల్ల పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అతివృష్టి వల్ల పంటలు తీవ్రంగా దెబ్బతిని పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొందని రైతులు టిడిపి ఇన్చార్జి వైకుంఠం జ్యోతి కి తెలిపారు. రైతులు అధైర్య పడవద్దని, ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని టిడిపి ఇన్చార్జి వైకుంఠం జ్యోతి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కిషోర్, మండల టిడిపి నాయకులు, కార్యకర్తలు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు