సాక్షి డిజిటల్ న్యూస్: కారేపల్లి, అక్టోబర్ 31 సింగరేణి మండల పరిధిలో మొంథా తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండడంతో రైతాంగం తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటుందని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్, అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకేఎస్) నాయకులు పేర్కొన్నారు. గత మూడు రోజులుగా కురుస్తున్న ఎడతెరపి లేని వర్షాల వలన పత్తి, మొక్కజొన్న, వరి, మిరప వంటి పంటలు విపరీతంగా నష్టపోయాయని తెలిపారు. సింగరేణి మండలంలోని టేకులగూడెం, పోలంపల్లి, పేరేపల్లి, మాదారం గ్రామాల్లో పంట నష్ట సర్వేలు నిర్వహించిన అనంతరం, తహసీల్దార్ మరియు వ్యవసాయ అధికారులకు వినతి పత్రం సమర్పించారు. నాయకులు మాట్లాడుతూ తీయడానికి సిద్ధంగా ఉన్న పత్తి చేలు తడిసి నల్లబడిపోయాయని, కాయలు మురిగి పోతున్నాయని, మొక్కజొన్న మరియు వరి పంటలు నేలమట్టం అవుతున్నాయని వివరించారు. మిరప తోటల్లో నీరు నిల్వ ఉండడం వల్ల చెట్లు చనిపోతున్నాయని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే పంట నష్ట సర్వేలు నిర్వహించి, నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. తడిసిన పత్తి, వరి, మొక్కజొన్న పంటలను ప్రభుత్వమే మద్దతు ధరలతో కొనుగోలు చేయాలని, మధ్యవర్తుల దోపిడీని అరికట్టాలని కోరారు. అంతేకాక, ప్రతి మండలంలో సీసీఐ (CCI) కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ సింగరేణి–కామేపల్లి సంయుక్త మండలాల కార్యదర్శి గుమ్మడి సందీప్, ఏఐయుకేఎస్ డివిజన్ కార్యదర్శి గుగులోతు తేజ నాయక్, పివైఎల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వి. రాకేష్, టియుసిఐ సంయుక్త మండలాల కార్యదర్శి ధరావత్ సక్రు, ఏఐయుకేఎఫ్ నాయకులు పులకాని సత్తిరెడ్డి, సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ నాయకులు రావుల నాగేశ్వరరావు, గుమ్మడి ఎర్రయ్య, తేలు సోనీ, రామారావు, రవి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.