సాక్షి డిజిటల్ న్యూస్, అక్టోబర్ 31, చిత్తూరు టౌన్(రిపోర్టర్ – జయచంద్ర): “భారత దేశాన్ని ఒక్కటిగా నిలబెట్టిన మహానేత సర్దార్ వల్లభభాయ్ పటేల్ స్ఫూర్తి నేటికీ మనందరికీ ప్రేరణ. ఆయన చూపిన ఐక్యతా మార్గం ప్రతి భారత యువకుడు అనుసరించాలి” అని ది అపోలో యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డా. హెచ్. వినోద్ భట్ అన్నారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా యూనివర్సిటీలో జాతీయ ఐక్యతా దినోత్సవంను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు, సోషల్ రెస్పాన్సిబిలిటీ క్లబ్ సభ్యులు సంయుక్తంగా నిర్వహించాయి. కార్యక్రమానికి వైస్ చాన్సలర్ డా. హెచ్. వినోద్ భట్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. పోతరాజు ముఖ్య అతిథులుగా హాజరై సర్దార్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వైస్ చాన్సలర్ డా. హెచ్. వినోద్ భట్ మాట్లాడుతూ “భారత దేశ ఐక్యతకు పునాది వేసిన సర్దార్ వల్లభభాయ్ పటేల్ ధైర్యం, దూరదృష్టి, సంకల్పం అపూర్వం. స్వాతంత్య్రం తర్వాత చిన్న చిన్న రాజ్యాలను ఏకం చేసి భారతదేశాన్ని ఒకటిగా నిలబెట్టారు. అందుకే ఆయనను ‘ఆధునిక భారత నిర్మాణ శిల్పి’గా గౌరవిస్తారు. ఆయన జీవితం దేశభక్తి, ఐక్యత, సేవాస్ఫూర్తికి నిదర్శనం. పటేల్ చూపిన మార్గం ప్రతి యువకుడికి ప్రేరణగా నిలవాలి” అని అన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు ‘నేషనల్ యూనిటీ క్విజ్’లో చురుకుగా పాల్గొన్నారు. చివరగా అందరూ కలిసి ‘జాతీయ ఐక్యత ప్రతిజ్ఞ’ చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డీన్ డా. జగదీశన్, ఎన్.ఎస్.ఎస్. కోఆర్డినేటర్ డా. హేమాద్రి రెడ్డి, ఎన్.ఎస్.ఎస్. అధికారులు షేక్ జకీర్, గాయత్రీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ క్లబ్ ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ డా. దివ్య, ఎన్.ఎస్.ఎస్. వాలంటీర్లు, సోషల్ రెస్పాన్సిబిలిటీ క్లబ్ సభ్యులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
