సాక్షి డిజిటల్ న్యూస్,కామేపల్లి (అక్టోబర్ 31) : ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో మొంథా తుఫాన్ అన్నదాతను అతలాకుతలం చేసిందని నష్టం వాటిల్లిన పంటలకు నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఖమ్మం డివిజన్ కార్యదర్శి కోలా లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం కామేపల్లి మండలంలో మద్దులపల్లి, ముచ్చర్ల, జాస్తిపల్లి, సాతానుగూడెం, గోవింద్రాల, కామేపల్లి గ్రామాలలో మొంథా తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పత్తి, మొక్కజొన్న, వరి, మిర్చి పంట చేనులను ఆ పార్టీ బృందం పరిశీలించారు.అనంతరం తహసిల్దార్ సిహెచ్.సుధాకర్ కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.అనంతరం కామేపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లక్ష్మీనారాయణ మాట్లాడుతూ. కష్టపడి పండించిన పంటలు కోత సమయంలో అకాల వర్షంతో పూర్తిగా దెబ్బతిని అన్నదాతలు నష్టపోయారన్నారు. మొంథా తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటలకు ఎకరానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.30 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మండల కేంద్రమైన కామేపల్లిలో ప్రభుత్వం తక్షణమే సిసిఐ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. పత్తి క్వింటాకు కనీస మద్దతు ధర రూ.10 వేల రూపాయలు ఇవ్వాలని, నాణ్యతతో సంబంధం లేకుండా పత్తి,వరి,మొక్కజొన్న పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కామేపల్లి మండల అఖిల భారత రైతు కూలి సంఘం (ఏఐకెఎంఎస్) కార్యదర్శి ఆంగోత్ లాలు, సిరిపురం సిరిపురపు సూర్యం, ఆముదలా వెంకటేశ్వర్లు, కోల దుర్గయ్య, చిల్లా కోటేశ్వరరావు, లక్ష్మయ్య,షేక్ పాషా రైతులు తదితరులు పాల్గొన్నారు.
