నష్టపోయిన పత్తి రైతులను ఆదుకోవాలి

*రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి *తడిసిన పత్తిని మద్దతు ధరకు కొనుగోలు చేయాలి *బి ఆర్ ఎస్ మండల కార్యదర్శి మర్రి మల్లారెడ్డి

సాక్షి డిజిటల్ న్యూస్ పినపాక ప్రతినిధి అక్టోబర్ 31 ఇటీవల కురిసిన మొంథా తుఫానుతో అధిక వర్షపాతంతో నష్టపోయిన పత్తి రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకొని ఎకరానికి 50వేలు నష్ట పరిహారం ఇవ్వాలని, తడిసిన పత్తిని మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని బి ఆర్ ఎస్ అశ్వాపురం మండల ప్రధాన కార్యదర్శి మర్రి మల్లారెడ్డి ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని పలు గ్రామాలలో తుఫానుకు దెబ్బతిన్న పంటచేలను పరిశీలించారు. అనంతరం బి ఆర్ ఎస్ మండల కార్యాలయంలో వారు విలేఖరుల తో మాట్లాడుతూ ఎన్నో ఆశలతో ఈ సంవత్సరం పత్తి సాగు చేస్తున్న రైతులు అకాల వర్షాలతో,అధిక వర్షపాతంతో పూర్తిగా నష్టపోయారన్నారు. దుక్కి దున్ని విత్తనాలను కొనుగోలుచేసి పైపాట్లు చేసి చీడపీడలు ఆశించకుండా మందులు కొట్టి, పంటకు పోషకాలను అందించి అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టినా, ఆరుగాలం శ్రమించిన రైతుల కష్టం అకాల వర్షాలతో కొట్టుకుపోయి రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టిన రైతులు తీరా పంట చేతికి వచ్చే దశలో వచ్చిన ప్రకృతి విలయ తాండవానికి పూత, పిందెలు, కాయలు, రాలిపోయిచేతికి వచ్చిన పంట తీసుకుందామనుకున్న దశలో వర్షాలకు పత్తి కారిపోయి తీవ్రంగా నష్టపోయి వారి జీవితాలు కుదేలైనాయన్నారు. కొన్ని కొన్ని గ్రామాల్లో వచ్చిన వరదలకు చేలు మొత్తం నేలకు అతుక్కున్నాయన్నారు.భూసారాన్ని పట్టి ఎకరానికి 10 నుండి 12 క్వింటాలు వచ్చే పత్తి దిగుబడి నేడు మూడు నాలుగు క్వింటాలు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. అధిక వర్షపాతంతో కూడిన తేమతో పత్తి చేలు తెగుళ్లకు గురి అయి తీవ్రంగా నష్టపోయి,పెట్టుబడులు కూడా రాక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న రైతులను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకొని ఎకరానికి 50వేలు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంబంధిత శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పంటలను పరిశీలించి పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నిదేధికలు పంపి రైతులను ఆదుకోవాలని బి ఆర్ ఎస్ మండల పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నామన్నారు.అధికారులు కూడా తడిసిన పత్తిని తేమ శాతం అని కొర్రీలు పెట్టకుండా ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర ఇచ్చి సిసిఐ కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు. రైతులను ఆదుకొని నష్టపరిహారం ఇవ్వని పక్షంలో బి ఆర్ ఎస్ పార్టీ తరుపున రైతులందరినీ ఏకం చేసి ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *