విద్యార్థుల సృజనాత్మకతకు వేదికగాఅపోలో ఇన్నోవేషన్‌ ప్రాజెక్ట్‌ ఎక్స్పో – 2025

సాక్షి డిజిటల్‌ న్యూస్‌, అక్టోబర్ 31, చిత్తూరు టౌన్‌(రిపోర్టర్‌ - జయచంద్ర): ది అపోలో యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఆధ్వర్యంలో నిర్వహించిన అపోలో ఇన్నోవేషన్‌ ప్రాజెక్ట్‌ ఎక్స్పో – 2025 విద్యార్థుల ప్రతిభ, సృజనాత్మకత, సాంకేతిక ఆవిష్కరణలకు వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమాన్ని యూనిర్శిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఎం. పొతరాజు ప్రారంభించి, విద్యార్థుల ప్రాజెక్ట్‌ ప్రదర్శనలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ — “ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో పరిశోధనా దృక్పథం, సాంకేతిక ఆత్మవిశ్వాసం పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ది అపోలో యూనివర్సిటీ రీసర్చ్‌ మరియు ఇన్నోవేషన్‌లను మరింతగా ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం ఇన్‌స్టిట్యూట్‌ ఇన్నోవేషన్‌ కౌన్సిల్‌ను ఏర్పాటు చేశాం. త్వరలోనే ఇంక్యూబేషన్‌ సెంటర్‌ మరియు వర్క్‌స్టేషన్‌ ఏర్పాటు చేసి, విద్యార్థులను స్టార్టప్‌లు, ఎంటర్‌ప్రెన్యూర్ల దిశగా ప్రోత్సహించబోతున్నాం. అలాగే, విద్యార్థుల ప్రాజెక్టులను పేటెంట్‌ స్థాయికి తీసుకెళ్ళేందుకు విశ్వ విద్యాలయం కృషి చేస్తున్నది,” అని ప్రొఫెసర్‌ పొతరాజు పేర్కొన్నారు. ఈ ఎక్స్పోలో విద్యార్థుల ప్రాజెక్టులు సృజనాత్మకత, సాంకేతిక ప్రతిభకు నిదర్శనంగా నిలిచి, సమాజానికి ఉపయోగపడే వినూత్న పరిష్కారాలను సూచించాయి. స్టూడెంట్స్‌ ఇష్యూ ట్రాకింగ్‌ ప్లాట్‌ఫాం, స్మార్ట్‌ హౌస్‌, మైన్‌ సేఫ్టీ హెల్మెట్‌, స్మార్ట్‌ హైడ్రా ఐఓటి సిస్టమ్‌, ఇరిగేషన్‌ మరియు లైటింగ్‌ సిస్టమ్‌లు, వాయిస్‌ కంట్రోల్డ్‌ రోబో, ఎమర్జెన్సీ లేన్‌ సిస్టమ్‌, ఏఐ ఆధారిత హాజరు మేనేజ్‌మెంట్‌ వంటి సాంకేతిక ఆవిష్కరణలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఈ ప్రాజెక్టులు విద్యార్థుల సృజనాత్మకతను, సాంకేతిక దృష్టిని ప్రతిబింబించాయి. ఈ కార్యక్రమంలో ఏఐఎంఎస్‌ఆర్‌ అసోసియేట్‌ డీన్‌ డా. రమ్యా రామకృష్ణన్‌, స్కూల్‌ ఆఫ్‌ టెక్నాలజీ డీన్‌ డా. డి. జగదీశన్‌, స్కూల్‌ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ డీన్ ప్రొ. కె. భాస్కర్‌రెడ్డి, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ డా. సేతురామ సుబ్బయ్య, నర్సింగ్‌ కాలేజీ వైస్ ప్రిన్సిపల్‌ జింటో మాథ్యూస్‌, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్లు డా. కె. తిరుమలేశు, డా. సి. పక్కిరయ్య, ఎన్‌. కీర్తి, ఎం. కమలహాసన్‌. అధిక సంఖ్యలో విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.