సాక్షి డిజిటల్ అక్టోబర్ 31 ధర్మపురి నియోజకవర్గ రిపోర్టార్ అజయ్ : మెట్ పల్లి పట్టణంలోని 24వ వార్డు పరిధిలో పాత మార్కెట్ రోడ్ వీధిలో వంగరి జశ్విత్ అనే ఏడేళ్ళ బాలుని పై వీధి కుక్కలు దాడి చేసినట్లు జశ్విత్ తండ్రి వంగరి రాజేష్ తెలిపారు. తమ వీధిలో చాలా రోజులుగా వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తూ, ప్రజలను కరుస్తూ దాడి చేస్తున్నాయన్నారు. గురువారం ఉదయం 9 గంటలకు తమ కుమారుడు జశ్విత్ స్కూల్ కు వెళ్తున్న క్రమంలో వీధి కుక్కలు దాడి చేసి కరవడం జరిగిందని, బాలునికి తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళి చికిత్స చేయించినట్లు తెలిపారు. అదేవిధంగా పట్టణంలోని పలు వార్డులో వీధి కుక్కలు గుంపులు గుంపులుగా స్వైరవిహారం చేస్తూ, పిల్లలను, వృద్ధులను దాడి చేస్తూ, కరవడంతో, వీధుల్లో నడవలంటేనే ప్రజలు జంకుతున్నట్లు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావున ఇప్పటికైనా సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించి, ఈ వీధి కుక్కల బెడద నుండి తమను కాపాడాలని అందుకు సంబంధిత అధికారులు తగు చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.