సాక్షి డిజిటల్ న్యూస్రిపోర్టర్:బొక్కా నాగేశ్వరరావు(అక్టోబర్ 31 2025) ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కిసర గ్రామం లో పునరావాస కేంద్రాన్ని సందర్శించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కంచికచర్ల మండలం : ఎగువ ప్రాంతాల నుంచి మున్నేరు వరద కొనసాగుతున్న ప్రవాహ నేపథ్యంలో, కీసర గ్రామంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గురువారం సందర్శించారు. తంగిరాల సౌమ్య తో పాటు ఉమ్మడి కృష్ణాజిల్లా కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాం కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు. ఈ పునరావాస కేంద్రంలో గత మూడు రోజులుగా 87 మంది బాధితులు తలదాచుకుంటున్నట్లు అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. కేంద్రంలో ఉన్న బాధితులతో ప్రత్యక్షంగా మాట్లాడిన తంగిరాల సౌమ్య వారికి అందుతున్న వసతి, ఆహారం, వైద్య సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు. అవసరమైన చోట తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని, పునరావాస కేంద్రంలో బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అందువల్ల బాధితులకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలు కల్పించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. ప్రజల భద్రత, ఆరోగ్యం, ఆహార అవసరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కంచికచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కోగంటి వెంకట సత్యనారాయణ (బాబు), సర్పంచ్ పేరం నరసమ్మ పరిటాల రాము కూటమి నేతలు, పునరావాస కేంద్ర బాధితులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.