అనకాపల్లి జిల్లా రహదారుల్లో ప్రయాణం నరకయాతనే…

అనకాపల్లి : సాక్షి డిజిటల్ న్యూస్ అక్టోబర్ 31, ( రిపోర్టర్ వేగి రామారావు) జిల్లా వ్యాప్తంగా రహదారుల పరిస్థితి ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తోంది. ఎక్కడ చూసినా గోతులు, చీలికలు, నీరు నిల్వలు – ఇలా రహదారులు ప్రయాణానికి కాకుండా ప్రమాదానికి మారిపోయాయి. ముఖ్యంగా కే.కోటపాడు, చోడవరం, మాడుగుల, రావికమతం, బుచ్చయ్యపేట తదితర మండలాల్లో ప్రధాన రహదారులు గుంతలతో నిండి పోవడంతో వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. మొన్నటి వర్షాలతో రహదారులు మరింత దారుణస్థితికి చేరాయి. వాహనాలు గోతుల్లో ఇరుక్కుపోయి చిన్నచిన్న ప్రమాదాలు సంభవిస్తున్నాయి. స్కూల్ పిల్లలు, వృద్ధులు, మహిళలు ప్రయాణించే సమయంలో భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలు పలుమార్లు స్థానిక ప్రజాప్రతినిధులకు, రోడ్లు భవనాల శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. కొంతమంది అధికారులు కాగితాల మీదే రిపోర్టులు పంపించి తమ బాధ్యత పూర్తయిందని భావిస్తున్నారు. “వాహనాలు పాడవుతున్నాయి, ప్రమాదాలు పెరుగుతున్నాయి… అయినా అధికారులు స్పందించడం లేదు” అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని రహదారుల మరమ్మతులు చేపట్టాలని, లేకపోతే నిరసనలు తెలపక తప్పదని హెచ్చరిస్తున్నారు.