ములుగు జిల్లాను ముంచేస్తున్న మెంతా తుఫాను

సాక్షి డిజిటల్ న్యూస్ టుడే/ములుగు జిల్లా ఇంచార్జీ జనపతి గత మూడు రోజులుగా ములుగు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు రైతాంగాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. మెంథా తుఫాన్‌ ప్రభావంతో నిరంతరంగా కురుస్తున్న వర్షాలు పంట పొలాలను ముంచెత్తి రైతుల సంవత్సర కష్టం నీటిలో కలిసిపోయింది. వర్షపు నీటి వల్లే పంట పొలాలు నాశనం అయ్యాయి. ముఖ్యంగా కోత దశలో ఉన్న వరి పంట పూర్తిగా దెబ్బతినడంతో, రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో మిరప మొక్కలు వర్షం వల్ల కుళ్లిపోవడం, ఆకులు ఊడిపోవడం వంటి సమస్యలు తలెత్తి ఆ పంటకూ నష్టం కలిగింది.ములుగు, వెంకటాపురం, ఎటూరునాగారం, గోవిందరావుపేట, తాడ్వాయి, మంగపేట మండలాల్లో రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. మూడు రోజులుగా విపరీతమైన ఈదురుగాలులు విస్తుండడంతో వరి పంట పూర్తిగా నేలకొరిగింది.ఎండ తగలకపోవడంతో కోత దశలో ఉన్న వరి ముద్దలు తడిసి పాడవుతున్నాయి. రైతులు పొలాల్లోకి వెళ్లి పంటను కోయాలన్నా నీటి మట్టం అధికంగా ఉండటంతో సాధ్యమవడం లేదు.వరి పంటలతో పాటు, జిల్లాలోని కొన్ని మండలాల్లో మిరప మొక్కలు కూడా వర్షానికి దెబ్బతిన్నాయి. మొక్కల వేర్లు కుళ్లిపోవడం, ఆకులు రాలి పోవడం వంటి సమస్యలు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రస్తుతం మిరప పంట పెరుగుదల దశలో ఉండటంతో ఈ వర్షం దాని పెరుగుదలపై కూడా ప్రభావం చూపింది.వాతావరణ శాఖ సమాచారం ప్రకారం, ములుగు జిల్లాలో మెంథా తుఫాన్‌ ప్రభావం ఇంకా కొనసాగుతుందని తెలిపింది. రాబోయే 24 గంటలపాటు తేలికపాటి నుంచి మధ్యస్థ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా. అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ వర్షాలతో ములుగు జిల్లాలో రైతులు మరోసారి ప్రకృతి సవాళ్లను ఎదుర్కొన్నారు. పురుగుమందులు, ఎరువుల ఖర్చులు, కూలీల సమస్యలతో ఇంతకాలం పోరాడి పంట కోత దశకు తీసుకువచ్చిన రైతులు ఇప్పుడు ఆ పంటను కూడా కోల్పోయారు. కొందరు రైతులు తాత్కాలికంగా నీటిని బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, వర్షం తగ్గకపోవడంతో ఆ ప్రయత్నాలు కూడా ఫలించడం లేదు.మెంథా తుఫాన్‌ వల్ల ములుగు జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతుల సంవత్సర కష్టాన్ని మట్టిపాలు చేశాయి. కోత దశలో ఉన్న వరి పంట నీటిలో మునిగి పాడవ్వగా, మిరప మొక్కలు కూడా కుళ్లిపోవడం ప్రారంభమైంది. సాధారణ ప్రజలు రహదారి, విద్యుత్‌, రవాణా సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు నష్టం అంచనా వేస్తుండగా, రైతులు ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు.