ఆలూరు,అక్టోబర్ 30,సాక్షి డిజిటల్ న్యూస్:- హోళగుంద మండల ప్రభుత్వ ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేయాలని హోళగుంద మండల తెలుగుదేశం పార్టీ నాయకులు గోవిందు గౌడ్, అబ్దుల్ సుభాన్, మొయిన్ , వలి బాషా,జాకీర్., ఈబదుల్ల, సుబాన్, తాహెర్ ,ఇలియాస్ తదితరులు బుధవారం నాడు ఆలూరు తెదేపా ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి కి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ హోళగుంద మండల ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో దాదాపు 40 వేల జనాభాకు వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. జనాభా క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రభుత్వాసుపత్రిని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేస్తే మండల ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. ఆసుపత్రి విస్తరణకు తగినంత భూమి మరియు మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, స్థానికులు, ప్రజా ప్రతినిధులు ఈ ప్రతిపాదనకు పూర్తిగా మద్దతు ఇస్తున్నారని తెలిపారు.కాబట్టి ఆసుపత్రి అప్ గ్రేడ్ కొరకు తగిన చర్యలు తీసుకొని ఈ ప్రతిపాదనను సంబంధిత ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఆలూరు తేదేపా ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి స్పందిస్తూ ఆసుపత్రి అప్ గ్రేడ్ ప్రతిపాదనను కలెక్టర్, డి ఎం హెచ్ ఓ ల దృష్టికి తీసుకెళ్లి హోళగుంద పి హెచ్ సి ని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.