జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీజేపీ దూకుడు

★ప్రజలకు మిగిలింది నిరాశ మాత్రమే-బీజేపీ నేతలు

సాక్షి డిజిటల్ న్యూస్,అక్టోబర్ 30, (శేరిలింగంపల్లి): ప్రజలు ఆశించిన మార్పు రాలేదని, కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలకు మిగిలింది నిరాశ మాత్రమేనని బీజేపీ నాయకులు తెలిపారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో షేక్‌పేట్ డివిజన్‌లో బీజేపీ బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ప్రముఖులు, డివిజన్ అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జ్‌లు, బూత్ ఇంచార్జ్‌లతో బుధవారం సమావేశం జరిగింది.కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవికుమార్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, షేక్‌పేట్ డివిజన్ ఇన్చార్జ్‌లు బంగారు ప్రకాశ్, రఘునాథ్ రావు, మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చంద్ర, షేక్‌పేట్ డివిజన్ అధ్యక్షుడు రాకేష్ సమావేశంలో పాల్గొన్నారు.నాయకులు మాట్లాడుతూ, ప్రతి కార్యకర్త తన ప్రాంతంలో ఓటర్లను కలుసుకుని ప్రజలకు బీజేపీ అభివృద్ధి విధానాలు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించాలని సూచించారు. గెలుపోటములను నిర్ణయించేది ఒక్క ఓటేనని గుర్తుచేస్తూ, జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ప్రతి ఓటరిని సంప్రదించి అధిక పోలింగ్ సాధించాలన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన “ఆరు గ్యారెంటీలు” మోసపూరితమైనవని, వాటి వాస్తవ పరిస్థితిని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తదని పేర్కొన్నారు. నవంబర్ 11న జరగబోయే ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.బీఆర్‌ఎస్ మరియు కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనలో తేడా లేదని, ప్రజల మేలు కోసం నిజమైన సంకల్పం ఉన్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని తెలిపారు. ప్రజలు ఇప్పటికే బీజేపీ పాలననే కోరుకుంటున్నారని అన్నారు.ప్రజలతో మమేకమవుతూ, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం జూబ్లీహిల్స్ అభివృద్ధిపై చూపిన నిర్లక్ష్యాన్ని వివరించామని తెలిపారు.ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షుడు శివసింగ్ రాందీన్, సీనియర్ నాయకులు వసంతకుమార్ యాదవ్, స్వామి గౌడ్, వరలక్ష్మి, ధీరజ్, దినేష్ యాదవ్, రాఘవేంద్ర, మోహన్ రెడ్డి, దుర్గారామ్, స్థానిక బీజేపీ నాయకులు, బూత్ అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జ్‌లు, కార్యకర్తలు పాల్గొన్నారు.